రామగిరి, జనవరి 15 : ముంగిళ్లలో ముత్యాల ముగ్గులు.. వాటిల్లో ఉంచిన గొబ్బెమ్మలు. ఆకాశంలో గాలి పటాల సందడి, హరిదాసుల సంకీర్తనలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. నోరూరించే పిండి వంటలు.. బంధుమిత్రుల కోలాహలంతో మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటేలా వైభవంగా సాగాయి. ఊర్లకు వచ్చిన పట్టణవాసులతో పల్లెలు సందడిగా మారాయి. భక్తులతో ఆలయాలు కిక్కిరిశాయి. ముంగిళ్లలో సంక్రాంతి ముగ్గులు ముచ్చటగొలిపాయి. సంబురాల సంక్రాంతి వేడుకలు ఉత్సాహ వాతావరణంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా జరిగాయి. తెల్లవారుజామునే లేచి వాకిళ్లను శుభ్రం చేసి మహిళలు లోగిల్లలో రంగవల్లులు వేసి వాటిల్లో గొబ్బెమ్మలు పెట్టి సంస్కృతిని చాటారు. భక్తులు ఆలయాలకు వెళ్లి తామంతా సుఖసంతోషాలతో ఉండాలని పూజించారు. జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయం, వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వరస్వామి, నల్లగొండలోని రామగిరిలో గల సీతారామచంద్రస్వామి, పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలతోపాటు అన్ని ఆలయాల్లో భక్తులు పోటెత్తారు.