నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 05 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 6 నుండి 18 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ఇంతవరకు రెమ్యూనరేషన్ చెల్లించలేదని, రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేను నేడు కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా కుల గణనకు ఆమోదం తెలిపిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించిన సిబ్బందికి కొన్ని జిల్లాల్లో చెల్లింపులు జరిపినప్పటికీ నల్లగొండ జిల్లాలో మాత్రం నేటికి రెమ్యూనరేషన్ చెల్లించకపోవడం శోచనీయమన్నారు.
రాష్ట్ర కార్యదర్శి జి.నాగమణి మాట్లాడుతూ.. గడిచిన మార్చి 18న కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటికీ సర్వే రెమ్యునరేషన్ చెల్లించలేదన్నారు. సర్వేలో మహిళా ఉపాధ్యాయులు ఎంతో శ్రమకోర్చి విధులు నిర్వచినట్లు తెలిపారు. వారం రోజుల్లో రెమ్యూనరేషన్ చెల్లించకపోతే టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా సంఘం నుండి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్‌రెడ్డి, కోశాధికారి వడిత్య రాజు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎడ్ల సైదులు, జిల్లా కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, గేర నరసింహ, నలపరాజు వెంకన్న, ఎ.చిన్న వెంకన్న, కొమర్రాజు సైదులు, ఆడిట్ కమిటీ సభ్యులు మధుసూదన్, రాగి రాకేశ్, వివిధ మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Nalgonda : సమగ్ర కుటుంబ సర్వే రెమ్యూనరేషన్‌ను వెంటనే చెల్లించాలి : టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి