కోదాడ, జూన్ 8 : కోదాడ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నారు. వారిని అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులే వత్తాసు పలుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. కోదాడలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోదాడ పెద్ద చెరువులోని రెండు వందల ఎకరాలను ఇప్పటికే కబ్జా చేశారని, తాజాగా సూర్యాపేట రోడ్డులోని పెట్రోల్ బంకు పక్కన రూ.20 కోట్ల విలువ చేసే 2000 గజాల చెరువు స్థలం కబ్జాకు గురవుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు గానీ, మున్సిపల్ అధికారులు గానీ చర్యలు తీసుకోవడంలేదన్నారు.
కోదాడ నడిబోడ్డున యాదవ నగర్లో లక్షల విలువ చేసి మున్సిపల్ స్థలాన్ని ఆ వార్డుకు చెం దిన ఓ కాంగ్రెస్ నేత రెండు నెలల క్రితమే ఆక్రమించుకొని బడ్డీకొట్టు ఏర్పాటు చేసుకున్నా మున్సిపల్ కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బొల్లం ప్రశ్నించారు. ఈ అంశంపై పట్టణంలోని స్వచ్ఛంద సంఘాల బాధ్యులు పలుమార్లు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకొని మున్సిపల్ స్థలాన్ని కాపాడాలన్నారు. పాత మున్సిపాలిటీలోని సామగ్రిని అద్దె భవనంలోకి మార్చేందుకు రూ.28 లక్షల బిల్లును మున్సిపల్ కమిషనర్ లెక్కల్లో చూపారని, ఇదేమిటని కౌన్సిలర్లు, నిలదీసినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తోందన్నారు.
ఆమె వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరో అందరికీ తెలుసన్నారు. దీంతో పాటు పాలకవర్గ అనుమతి లేకుండా తన ఇష్టమొచ్చిన రీతిలో తాత్కాలిక ఉద్యోగులను నియమించి రూ.లక్షలు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. గుడిబండ, కాపుగల్లు, సింగారంతో పాటు పలు గ్రామ శివార్లలోని ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా మట్టిని తోడుతూ లక్షలు దండుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులదీ అదే తీరు అని, అన్ని శాఖలూ అవినీతి కూపాలుగా మారాయన్నారు.
ఇక మున్సిపాలిటీలో ఎలాంటి టెండర్ లేకుండా సెంట్రల్ లైటింగ్ పనులకు రూ.50 లక్షలు ఖర్చు చేయడంపై విచారణ చేపట్టాలని, చివరకు సమోసాలకు కూడా రూ.40 లక్షల ఖర్చు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే చెబుతున్నారని ఆచరణలో మాత్రం అమలు కావడం లేదనేందుకు శిలఫలకాలే సాక్షి అని బొల్లం ఎద్దేవా చేశారు. సమావేశంలో పట్టణ నాయకులు రమేశ్, భూపాల్‌రెడ్డి, ఉపేందర్, కందిబండ సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, ఉపేందర్ గౌడ్, కరీముల్లా, బాబా, మణికంఠ తదితర నాయకులు పాల్గొన్నారు.