నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్22(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. గత కొంతకాలంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళనబాట పట్టాయి. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పడి సంస్థ యాజమాన్యానికి గతంలో సమ్మె నోటీసులు ఇచ్చింది. అయినా ప్రభుత్వం స్పందించపోవడంతో అనివార్యంగా సమ్మెకు దిగారు.
బుధవారం తెల్లవారు జామున మొదటి షిప్టులో విధులకు హాజరుకావాల్సిన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అంతా డ్యూటీలకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోల పరిధిలో కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగారు. బస్సులు బయటకు రాకుండా కార్మికులు డిపోల ఎదుట బైఠాయించారు. వారికి వివిధ పార్టీలతో పాటు కార్మిక సంఘాల నేతలు మద్దతు ప్రకటిస్తూ ఆందోళనలో భాగమయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 733 బస్సులపై సమ్మె ప్రభావం పడింది. తొలిరోజు బుధవారం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే ప్రధాన రూట్లలో తిప్పుతూ బస్సులు నడిపించినట్లుగా అధికారులు ప్రకటించారు. కానీ బస్సులు నిలిచిపోవడంతో రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడంతో ఇదే అదునుగా అదనపు చార్జీల మోత మోగించారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..
నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్పల్లి, యాదగిరిగుట్ట, సూర్యాపేట, కోదాడల్లో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిల్లో మొత్తం 733 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ బస్సులు 329, అద్దె బస్సులు 235, ఎలక్ట్రిక్ బస్సులు 169 ఉన్నాయి. వీటి కోసం 719 మంది డ్రైవర్లు, , 1012 మంది కండక్టర్లు, 264 మంది గ్యారేజీ సిబ్బందితో కలిపి మొత్తం 1995 మంది నిత్యం విధులు నిర్వర్తిస్తున్నారు. 2019లో జరిగిన సమ్మె అనంతరం మళ్లీ ఏడేండ్ల అనంతరం కార్మికులు సమ్మెకు దిగారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆర్టీసీ సంస్థతో పాటు అందులో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది కోసం పలు హామీలను ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక మళ్లీ అటువైపు తిరిగి చూడలేదు. పైగా ఎలక్ట్రిక్ బస్సులను విచ్చలవిడిగా తెచ్చి వాటిని పూర్తిగా ప్రైవేటు సిబ్బందితోనే ఆపరేట్ చేస్తున్నారు.
అలాగే సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ వస్తున్నారు. ఉన్న బస్సుల్లో మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బస్సుల సంఖ్య తగ్గడంతో ఉన్న బస్సుల్లోనే ఒక్కో దానిలో 80-100 మంది వరకు ప్రయాణిస్తుండటంతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అదనపు డ్యూటీ చేయాల్సి వస్తోంది. ఇలా అనేక సమస్యలతో గత రెండేండ్లుగా ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సతమతమవుతున్నారు. తమ సమస్యలపై ఏడాదికాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా పట్టించుకోలేదు. దీంతో గత మూడు నెలలుగా కార్యచరణను ప్రకటించి, కార్మిక సంఘాలన్నీ కలిపి జేఏసీగా ఏర్పాటై ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. పలుమార్లు డిపోల ఎదుట ఆందోళనలు చేపట్టింది. చివరకు ప్రభుత్వం మొండివైఖరిపై తిరుగుబాటును ప్రకటిస్తూ సమ్మె నోటీసులు అందజేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో బుధవారం తెల్లవారుజాము నుంచి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు.

నిలిచిన బస్సులు..
ఉమ్మడి జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచే ఆయా డిపోల్లోని బస్సులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీకి సంబంధించిన ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. ఉదయాన్నుంచే డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికులు, ఇతర సిబ్బంది అంతా విధులకు దూరంగా ఉన్నారు. నల్లగొండ డిపోలో ఉదయం నాలుగు గంటల నుంచే జేఏసీ నేతలు, కార్మికులు ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. వీరికి సీపీఎం, సీపీఐ, ఎంఎల్ పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ కార్మిక సంఘం, సీఐటీయూ, ఏఐటీయూసీ లాంటి కార్మిక సంఘాల నేతలు మద్దతు ప్రకటిస్తూ ఆందోళనలో భాగమయ్యారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. వీరికి సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిపో వద్దకు చేరకుని మద్దతు ప్రకటించారు. మిర్యాలగూడ, దేవరకొండ, నార్కట్పల్లి ఆర్టీసీ డిపోల ఎదుట కూడా జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు బైఠాయించారు. సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్ట డిపోల్లోనూ కార్మికులంతా విధులు బహిష్కరించి గేట్ల ఎదుట బైఠాయించారు. అంతకుముందే బయటకు వెళ్లిన బస్సులను లోపలికి అనుమతిస్తూ డిపోల నుంచి మాత్రం ఒక్క బస్సు బయటకు రాకుండా చూశారు.

ప్రధాన డిమాండ్లు ఇవే