యాదాద్రి భువనగిరి, మార్చి 1 (నమస్తే తెలంగాణ) ;కార్పొరేట్ల సర్కార్‌గా పిలువబడుతున్న కేంద్రంలోని మోదీ సర్కార్ మరోసారి సామాన్యులపై విరుచుకుపడింది. బీదసాద తేడా లేకుండా వినియోగించే వంట గ్యాస్ ధరను అమాంతం పెంచేసింది. ఒక్కో వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50, కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగా రూ.350 పెంచి ప్రజలపై తన ప్రతాపాన్ని చూపింది. దాంతో గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీ తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టం చేసింది. దీని వల్ల ఉమ్మడి జిల్లాలో వినియోగంలో ఉన్న 11.13లక్షల గ్యాస్ సిలిండర్లపై అదనంగా రూ.5.56కోట్ల భారం పడనుంది. ఇందులో ఒక నెలలో సుమారు 3.65లక్షల సిలిండర్లు రీఫిల్ అవుతుండగా రూ.1.83కోట్ల భారం ప్రజలు ప్రత్యక్షంగా మోయాల్సిందే. 2014లో మోదీ అధికారంలోకి వచ్చే నాటికి సిలిండర్ ధర కేవలం 410రూపాయలు ఉండగా.. తాజా పెంపుతో అది మూడు రెట్లకు చేరువైంది. ప్రస్తుతం వంట గ్యాస్ బండ రూ.1,105 ఉండగా 1,155 రూపాయలకు, కమర్షియల్ గ్యాస్ రూ.1950 నుంచి 2300 రూపాయలకు చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర పెంపు చిరు వ్యాపారుల ఉపాధికి పెనుముప్పుగా మారింది. స్ట్రీట్ వెండర్లు, బండీ కొట్టువాలాల జీవితాలు ఆగం కానున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర ధరలు చుక్కలనంటుతుండగా వీటికి గ్యాస్ ధర పెంపు తోడవడంతో సామాన్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. పెంచిన గ్యాస్ ధరలపై గురు, శుక్రవారాల్లో అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
కేంద్రం తీరుతో వంటకు కట్టెల పొయ్యే దిక్కయ్యేటట్టుంది. ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో మారు 50 రూపాయలు బాదింది. దీంతో గ్యాస్ బండ రేటు రూ.1155కి చేరింది. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు గుదిబండగా మారింది. ఇప్పటికే నిత్యావసర వస్తువులతోపాటు పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో సతమతమవుతున్న జనం.. తాజాగా సిలిండర్ ధర పెంచడంతో లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం తీరుపై భగ్గుమంటున్న సామాన్య ప్రజలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
పెట్రో, నిత్యావసరాల ధరలతో జనం లబోదిబో..
కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పేదలు బతుకలేని పరిస్థితి ఏర్పడింది. ఏ రంగంలో చూసినా రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. డీజిల్, పెట్రోల్ ధరలు నింగి వైపు చూస్తున్నాయి. 2014లో పెట్రోల్ ధర లీటరుకు రూ.71 ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.119కి పెరిగింది. డీజిల్‌దీ అదే పరిస్థితి. 2014లో డీజిల్ లీటర్ ధర రూ.55 ఉండగా, ఇప్పుడు రూ.98కి ఎగబాకింది. దీంతో వాహనదారులు బండ్లను నడిపే పరిస్థితి లేకుండా పోయింది. ఇక నిత్యావసర ధరలు సైతం భగ్గుమంటున్నాయి. ఏం కొనలేని పరిస్థితి దాపురించింది. పప్పులు, ఉప్పులు, బియ్యం, కూరగాయలు తదితర అన్నింటి ధరలు పెరిగిపోయాయి. కేంద్రం తీరు చూస్తుంటే మున్ముందు ఇంకా ఎంత పెరుగుతుందోనని జనం భయాందోళన చెందుతున్నారు.
సబ్సిడీకి మంగళం
కేంద్ర సర్కారు ఓ వైపు గ్యాస్ ధరలు పెంచుతూనే.. మరో వైపు గ్యాస్ సబ్సిడీకి మంగళం పాడే ప్రయత్నం చేస్తున్నది. 2014కు ముందు గ్యాస్ సబ్సిడీ విధానం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక గ్యాస్‌పై అధికంగా వసూలు చేస్తూ.. అందులోంచి సబ్సిడీ పేరుతో కొంత తిరిగి ఇచ్చే చెత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కానీ.. అది కూడా సక్కగా అమలు కావడం లేదు. రాను రానూ సబ్సిడీని తగ్గిస్తూ పోతున్నది. ఇప్పుడు ఒక్కో సిలిండర్‌పై అతి తక్కువగా రూ.40 సబ్సిడీ ఇస్తున్నది.
నాడు రూ.410.. నేడు రూ.1155
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి గ్యాస్ సిలిండర్ ధర రూ.410 ఉంది. ఇప్పుడు రెండు రెట్లు దాటిపోయింది. మంగళవారం వరకు వంట గ్యాస్ ధర రూ.1105 ఉండగా.. తాజాగా ఒక్కో సిలిండర్‌పై 50 రూపాయలు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1155కి పెరిగింది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై జనవరిలోనే రూ.25 బాదారు. ఇప్పుడు మళ్లీ రూ.300 పెంచడంతో రూ.2,268కి చేరింది. భారీ పెరుగుదలలో బతుకు జీవుడా అని జనం ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.10 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. తాజా పెంపుతో జిల్లా వినియోగదారులపై కోటి రూపాయల వరకు అదనపు భారం పడుతున్నది.
అన్ని రంగాలపై ఎఫెక్ట్..
గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా సామాన్యులు సిలిండర్ కొనలేని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు కట్టెల పొయ్యి పొగలతో అనారోగ్యంపాలైన గృహిణులు గ్యాస్ రాకతో ఆ బాధ నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు సిలిండర్ ధర పెంపుతో మళ్లీ కట్టెల పొయ్యి పెట్టాల్సి వస్తుందేమోనని పేద మహిళలు ఆందోళన చెందుతున్నారు. హోటళ్లు, ఇడ్లి బండ్లు, స్ట్రీట్ వెండర్లు తదితర చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఉమ్మడి జిల్లాలో రూ.5.56కోట్ల భారం
తాజాగా గ్యాస్ సిలిండర్‌పై ధర పెంపుతో ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులపై రూ.5.56కోట్ల అదనపు భారం పడనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉమ్మడి జిల్లాలో మొత్తం 73 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా.. వాటి పరిధిలో సుమారు 8.50లక్షల గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వారికి సంబంధించి 11.13 లక్షల గ్యాస్ సిలిండర్లు వినియోగంలో ఉన్నాయి. ప్రస్తుతం 14.2కిలోల గ్యాస్ బండపై కేంద్ర ప్రభుత్వం 50రూపాయలు పెంచింది. ఈ పెంపుతో జిల్లా ప్రజల జేబుల్లోంచి మోదీ సర్కార్ 5.56 కోట్ల రూపాయలను అదనంగా దోచుకోనున్నది. జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్లగొండలో 4.97లక్షలు, సూర్యాపేటలో 4.05లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.10లక్షల గ్యాస్ సిలిండర్లు వినియోగంలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మూడు వేలకు పైగా కమర్షియల్ సిలిండర్ల వినియోగం ఉండగా.. రూ.10.50లక్షల అదనపు భారం పడనుంది. ఉమ్మడి జిల్లాలో వినియోగంలో ఉన్న మొత్తం గ్యాస్ సిలిండర్లలో నెలకు సుమారు 3.65లక్షల సిలిండర్లు రీఫిల్‌కు వస్తున్నట్లు అంచనా. తాజాగా పెంచిన భారంతో నెలకు జిల్లా ప్రజలపై 1.83 కోట్ల రూపాయల అదనపు భారం జిల్లా ప్రజలపై పడనుంది.
పెరిగిన గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ యుద్ధభేరి
ధర్నాలు, నిరసనలకు మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపు పెరిగిన వంట గ్యాస్ ధరలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేపట్టాలని మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 2న మండల కేంద్రాల్లో, 3న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. పార్టీ శ్రేణులతోపాటు మహిళలు అధికంగా పాల్గొనేలా చూడాలని కోరారు.
ధరలిట్ల పెంచితే మేమెట్ల బతుకాలె..
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి నిరుపేదల బతుకులతో ఆటలాడుతుంది. సిలిండర్‌పై మరోసారి రూ.50 పెంచి ప్రజల నడ్డి విరుస్తుంది. మేం నిరుపేదలం.. గ్యాస్ ధరలు ఇట్ల పెంచితే మా బతుకులు ఎట్ల సాగాలె. కేంద్రంలో ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి వాళ్లకు ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారు. మోదీ ప్రభుత్వం బ్యాంకుల్లో కోట్ల అప్పులు తీసుకొని ఎగ్గొట్టినోళ్లకు మేలు చేస్తూ మాలాంటి పేదోళ్ల పొట్ట కొడుతుంది. బీజేపీ ప్రభుత్వానికి మహిళల ఉసురు తప్పక తగులుతుంది.
– మోకాళ్ల సత్తెమ్మ, చిరు వ్యాపారి, గుండాల
గ్యాస్ ధర పెంపుతో మరింత భారం
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో మరింత భారం పడుతుంది. ప్రస్తుతం రూ.2200 ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 350 రూపాయలు పెంచి రూ.2,550 చేశారు. దీంతో రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులు సిలిండర్‌కే పోయేటట్టున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు గ్యాస్ ధర పెంచి మోయలేని భారం మోపారు. టిఫిన్ ధర పెంచితే జనం రాని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో టిఫిన్ సెంటర్ నడిపించాలో బంద్ పెట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది.
– పెరికే అనిల్‌కుమార్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు (భువనగిరి అర్బన్)
సామాన్యుడు బతుకలేని పరిస్థితి తెచ్చిన బీజేపీ
కేంద్ర ప్రభుత్వ విధానాలతో సామాన్యుడి జీవితం ఆగమ్యగోచరంగా మారింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు సబ్ కా పరేషానీ అనే విధంగా ప్రజల నడ్డి విరుస్తుంది. ఒకవైపు నిత్యావసర ధరలు, మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి జీవితాలను అంధకారంలోకి నెట్టింది. దేశమంతా కట్టెల పొయ్యి లేని కాలుష్య రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి మోదీ ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. మొదట్లో సబ్సిడీని బ్యాంకు ఖాతాల్లో వేసి ఇప్పుడు మొండిచేయి చూపిస్తూ నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇలా ధరలు పెంచడం చూడలేదు. వ్యాపారం చేయలేని పరిస్థితి నెలకొంది. టీ ధరలు పెంచితే గిరాకీ రాని పరస్థితులు ఉన్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది.
– లింగయ్య, టీస్టాల్ యజమాని (మిర్యాలగూడ టౌన్)
వ్యాపారం తగ్గుతుంది.. ధరలు పెరుగుతున్నాయి
కరోనాతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే వ్యాపారం కోలుకుంటుండగా.. పెరుగుతున్న ధరలతో భారమవుతుంది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధర పెంపునకు అంతు లేదు. మేము సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీ హౌజ్ నడుపుతున్నాం. నెలకు 4 నుంచి 5 కమర్షియల్ సిలిండర్లు పడుతాయి. వాటి ధర ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. చేసేదేమీ లేక కొనుగోలు చేయాల్సి వస్తుంది. చాయ్ ధర పెంచితే అంతంత మాత్రంగా ఉన్న గిరాకీ అమాంతం పడిపోతుంది. అటు ధరలు పెంచలేం.. ఇటు కేంద్ర ప్రభుత్వం మోపుతున్న భారాలు భరించలేకున్నాం.
– జక్కలి స్వరూప, సూర్యాపేట (బొడ్రాయిబజార్)
సామాన్యుడు బతుకలేని పరిస్థితి తెచ్చిన బీజేపీ
కేంద్ర ప్రభుత్వ విధానాలతో సామాన్యుడి జీవితం అగమ్యగోచరంగా మారింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు సబ్ కా పరేషానీ అనే విధంగా ప్రజల నడ్డి విరుస్తుంది. ఒకవైపు నిత్యావసర ధరలు, మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి జీవితాలను అంధకారంలోకి నెట్టింది. దేశమంతా కట్టెల పొయ్యి లేని కాలుష్య రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. మొదట్లో సబ్సిడీని బ్యాంకు ఖాతాల్లో వేసి ఇప్పుడు మొండిచేయి చూపిస్తూ నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇలా ధరలు పెంచడం చూడలేదు. వ్యాపారం చేయలేని పరిస్థితి నెలకొంది. టీ ధరలు పెంచితే గిరాకీ రాని పరస్థితులు ఉన్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి
జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది.
– లింగయ్య, టీస్టాల్ యజమాని (మిర్యాలగూడ టౌన్)