సూర్యాపేట, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో జిల్లా కేంద్రాలనుంచి మారుమూల గ్రామాలకు తండాలకు పోలేని పరిస్థితి నెలకొంది. యాదాద్రి భవనగిరి జిల్లా బీబీనగర్ మండలం రుద్రవెల్లి గ్రామంలోని మూసీ వంతెనపై ఉన్న రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. అలాగే భూదాన్ పోచంపల్లి మండలం గౌస్‌కొండ గ్రామం నుంచి పెద్ద రావులపల్లి వరకు ఉన్న రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. చౌటుప్పల్ మండలం నేలపట్ల కుంటకు గండి పడటంతో వరట్పల్లి, నేలపట్ల రహదారి పూర్తిగా పాడైపోయింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో మండలంలోని 25 నుంచి 30 కంకరరోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే సూర్యాపేట జిల్లాలోని బూరుగడ్డ నుంచి హుజూర్నగర్ వచ్చే లింక్ రోడ్డు నాణ్యత సక్రమంగా లేకపోవడంతో వర్షాలకు కొట్టుకుపోయింది . దీంతో హుజూర్నగర్ వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో దెబ్బతిన్న రహ దారుల మరమ్మతుల నిమిత్తం అధికారులు రూ.45 కోట్ల అంచనా వ్యయంతో నివేదిక రూపొందించారు. ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తూ బడ్జెట్ విడుదల చేసిందే తప్ప బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వకపోవడం గమనార్హ ం.
ఇటీవల కురిసిన భారీ వర్షాలుకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రహదారులు కోతలకు గురి కావడంతో భారీ నష్టం జరిగింది. అయితే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా హుజూర్నగర్, కోదాడ, తుంగతుర్తి తదితర ప్రాంతాల్లో రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో అధికారులు రూ.41 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. అయితే ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తూ జీవో జారీ చేసిందే తప్ప బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వకపోవడం గమనార్హం. జనం ఎదుట ఎంతో ఆర్భాటంగా నిధులు ప్రకటించడం… అనంతరం ఆ విషయాన్నే విస్మరించడంతో ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.
రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదైన దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతర నిర్వహణకు కూడా ప్రభుత్వం రూ. 5 కోట్లు ప్రకటించి జీవో జారీ చేసిందే తప్ప, ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడం గమనార్హం. జిల్లాలోని 50 ప్రాంతాల్లోని ఆర్ అండ్ బీ పరిధిలోని రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లినట్ల్లు గుర్తించి ఎస్టిమేషన్లు తయారు చేసి పంపించారు. వీటి మరమ్మతులకు దాదాపు 45 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా, తాత్కాలిక మరమ్మతులకు రూ.25 లక్షల వరకు అవుతుందని అంచనా వేశారు. అయితే ప్రభుత్వం నుంచి జీవో విడుదలైందే తప్ప నిధులు మంజూరుకాకపోవడంతో పనులు జరగడం లేదు. దీంతో ఆయా రహదారులపై ప్రయణించాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రహదారి
హుజూర్నగర్ రూరల్, సెప్టెంబర్ 9 : హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డ నుంచి హుజూర్నగర్ వచ్చే లింక్ రోడ్డు నాణ్యత సక్రమంగా లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది . ఈ రోడ్డు కొట్టుకుపోవడంతో హుజూర్నగర్ వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంటనే ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.
కంకరరోడ్లు ధ్వంసం
నల్లగొండ, సెప్టెంబర్ 9: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. మండలంలోని కల్మరషాపల్లి, చిత్తలూరు, కడపర్తి, గౌరారం, కురుమూర్తి, నకిరేకల్, గురజాల ప్రాంతాల్లో ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయి. ఊట్కూరు, బండమీది గూడెం మధ్యలో ఉన్న పంచాయతీరాజ్ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. 25 నుంచి 30 కంకరరోడ్లు ధ్వంసమయ్యాయి.
మూసీ వంతెనపై దెబ్బతిన్న రోడ్డు
భారీ వర్షాలతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. కొన్ని తండాలకు, గ్రామాలకు వెళ్లే రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనాలు వదిలేసి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. యాదాద్రి భవనగిరి జిల్లా బీబీనగర్ మండలం రుద్రవెల్లి గ్రామ మూసీ వంతెనపై రోడ్డు కొట్టుకుపోయింది. కొత్త బ్రిడ్జి నిర్మాణం దేవుడెరుగు.. ఉన్న రోడ్డుకూ కనీసం మరమ్మతు చేయలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం గౌస్‌కొండ గ్రామం నుంచి పెద్ద రావులపల్లి వరకు గల రోడ్డంతా గుంతలమయంగా మారింది. గౌస్‌కొండ చెరువు కట్ట మూలమలుపు, మైసమ్మ గుండు, దర్గా సమీపం, పెద్ద రావులపల్లి గ్రామ శివారులో పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల కుంటకు గండి పడి వరట్పల్లి, నేలపట్ల రహదారి పాడైంది.