వానకాలం సాగు రైతులకు భారంగా మారుతున్నది. ఆరుగాలం కష్టించినా ఫలితం లేకుండా పోతున్నది. వరి సాగు కత్తిమీద సాములా మారింది. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పటం లేదు. రైతే దేశానికి వెన్నెముక అంటూనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల వెన్ను విరుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు ఖర్చు బాగా పెరిగింది. ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్ దున్నకం, ప్లౌ వేయటం, కూలీల రేట్లు బాగా పెరిగాయి. దీనికి తోడు పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు సైతం సాగుపై ప్రభావం చూపుతున్నాయి. వ్యవసాయ పంపుసెట్లు ట్రాక్టర్ వంటి వాటి రేట్లూ కూడా భారీగా పెరిగాయి. సాగు ఖర్చు పెరగటంతో కేంద్ర ప్రభుత్వం పెంచే ధర పెట్టుబడి ఖర్చులకు సరిపోవటం లేదు. దీంతో అన్నదాత అడుగడుగునా అవస్థలు పడాల్సి వస్తున్నది.
తిరుమలగిరి, జూన్ 10 : అన్నదాతలు ప్రధానంగా వరి, ఆ తర్వాత రెండో పంటగా పత్తి సాగు చేస్తున్నారు. వరి సాగుకు ఎకరాపై రూ.40 వేలు ఖర్చు వస్తుంది. సగటున 23 క్వింటాళ్లు దిగుబడి వస్తున్నది. ప్రభుత్వం కొంటేనే మద్దతు ధర లభిస్తుంది. అప్పుడు రూ.56,143 ఆదాయం వస్తుంది. సొంత భూమి ఉన్న రైతుకు ఖర్చు పోనూ రూ .16.343 మిగులుతుంది. రైతు కుటుంబం మొత్తం రాత్రి పగలు తేడా లేకుండా ఆరు నెలలు కష్టపడితే నెలకు రూ 2.723 వేతనం పడుతుంది. ప్రైవేటు వ్యాపారులు, దళారులను ఆశ్రయిస్తే మిగితేది అప్పు మాత్రమే. గతేడాది కేంద్ర ప్రభుత్వం వరికి రూ. 69 పెంచింది. దీనితో క్వింటాల్ రూ. 2,369 కాగా 2026-27లో రూ.3 పెంచింది. దీంతో రూ. 2,441 పెరిగింది. పెట్టుబడి ఖర్చులతో పోలిస్తే రైతులకు మిగిలేదేమీ లేదు.
పత్తి సాగుకు ఎకరాకు రూ.44.400 ఖర్చు వస్తుంది. ఎకరాకు సగటున 7 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. సగటున క్వింటాల్‌కు రూ. 14.00 పత్తి కూలీ అవుతుంది. ఏడు క్వింటాళ్లకు రూ.9.800 పత్తి కూలీ, పెట్టుబడి ఖర్చు రూ.34.600 కలిపి మొత్తం రూ 44.400 ఖర్చు వస్తుంది .ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ఏడు క్వింటాళ్లకు రూ.60.669 ఆదాయం వస్తుంది. సొంత భూమి ఉన్న రైతులకు ఖర్చు పోనూ రూ. 16.269 మిగులుతుంది. సుమారు 8 నెలలు కష్టపడితే రైతు కుటుంబానికి నెలకు రూ. 2.033 వేతనం అందుతుందన్నమాట.
వాన కాలం సాగు సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ఎరువుల ధరల రూపంలో భారీ షాక్ తగిలింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు రూ . 100 నుంచి రూ . 500 వరకు పెరిగాయి. పెరిగిన ఎరువుల ధరలతో జిల్లా రైతులపై రూ.45 కోట్లకు పైగా భారం పడనుంది. గ్రామాల్లో పశు సంపద తగ్గిపోవటంతో సేంద్రియ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గింది. దీంతో రైతులు రసాయన ఎరువులు వాడాల్సిన పరిస్థితి నెలకొంది. వానకాలం జిల్లాలో సాధారణ సాగు 6.19 లక్షల ఎకరాలు కాగా, సుమారు 3.27 లక్షల మంది రైతులు సేద్యం చేస్తున్నారు. రెండు సీజన్లకు గానూ 2.17 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఉపయోగిస్తున్నారు. దీని ప్రకారం జిల్లా రైతులపై రూ.45 కోట్లలో భారం పడనుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో జిల్లా ప్రజలపై నెలకు రూ.13.05 కోట్లు భారం పడుతుంది. ఇందులో అగ్రభాగం వ్యవసాయంపై పడుతుంది. నేడు వ్యవసాయంలో దుక్కులు దున్నడం మొదలు కోతలు, పండిన పంట మార్కెట్‌కు తెచ్చే వరకు యంత్రాలతోనే నడుస్తుంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అన్నదాతలకు గుదిబండగా మారాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై చిన్న చూపు చూస్తున్నాయి. అందరికీ అన్నం పెట్టే రైతులకు కష్టాలే ఎదురవుతున్నాయి. సాగు కత్తి మీద సాములా మారింది. ఎండా వానా తేడా లేకుండా కష్టపడిన రైతులకు మిగిలేది అప్పులే . సాగు ఖర్చు బాగా పెరిగింది. వ్యవసాయం చేయాలంటేనే రైతులు జంకుతున్నారు. గతం ప్రభుత్వ హయాంలో సాగు సంబురంగా చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు అరిగోస పడాల్సిన దుస్థితి నెలకొంది.