నీలగిరి, డిసెంబర్ 6 : నల్లగొండ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేయడంతోపాటు 2019 సంవత్సరంలోనే వైద్య తరగతులను ప్రారంభించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. వైద్య కళాశాలకు శాశ్వత భవనం ఉండాలని 2022లోనే 42 ఎకరాల విస్తీర్ణంలో రూ.114 కోట్ల్లు మంజూరు చేయగా, అప్పటి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పునాది రాయి వేశారు. ఆ నిర్మాణాన్నే శనివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
వైద్య కళాశాల ఏర్పాటు ద్వారా ఎంబీబీఎస్ సీట్లతోపాటు నల్లగొండ జిల్లా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా మొక్కవోని ముందుకు సాగింది. జిల్లా కేంద్ర దవాఖానలో తాత్కాలిక భవనంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. 2019 సంవత్సరంలో పట్టణ శివారు ప్రాంతంలోని ఎస్ఎల్బీసీలో 42 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పదెకరాల విస్తీర్ణంలో 4 లక్షల చదరపు మీటర్లలో కళాశాల భవనంతోపాటు బాలురు, బాలికలకు వేర్వురుగా హాస్టళ్లు, ప్రిన్సిపాల్ క్వాటర్లు నిర్మించింది.
2018లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండకు మెడికల్ కళాశాల మంజూరు చేయగా, 2019 ఆగస్టులో తరగతులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 128 సీట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి 22 సీట్లతో కలిపి మొత్తం 150 సీట్లను మంజూరు చేశారు. బోధనకు ప్రొపెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్స్ కలిపి 80 మందితో తరగతులు నడిపిస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఏటా 150 మంది చొప్పున 900 మంది మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొంది విద్యాభ్యాసం చేస్తున్నారు. 900 మంది విద్యార్ధులు ఉండేందుకు వీలుగా బాలురు, బాలికల హాస్టల్ నిర్మించారు. 5.6 ఎకరాల్లో పార్కులు ఏర్పాటు చేశారు. ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ, కాంపాండ్ వాల్ నిర్మాణం చేపట్టారు.
నల్లగొండ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎనిమిది విభాగాలుగా చేపట్టారు. ఐదు బ్లాక్‌ల్లో తరగతి గదులు, లెక్చరర్ గ్యాలరీ, ఒక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఒక బ్లాక్‌లో ఆకడమిక్, ఎగ్జామీనరీ హాల్ ఏర్పాటు చేశారు. ప్రయోగశాల బ్లాక్, డిపార్ట్మెంట్ బ్లాక్, రెస్టారెంట్‌ను వైద్య విద్యార్ధులకు అందుబాటులో ఉండేలా నిర్మించారు. బాలురకు జీ+5, బాలికలకు జీ+4, ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్లు, ఉండేందుకు వీలుగా జీ+3 సామర్ధ్యంతో ప్రిన్సిపల్ క్వాటర్స్ నిర్మాణం చేపట్టారు.
నల్లగొండ సిటీ : నల్లగొండకు మెడికల్ కళాశాలను మంజూరు చేసి భవన నిర్మాణం చేపట్టినందుకు గానూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం కనగల్ సెంటర్లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీను మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నో అభివృద్ది పనులు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ చేపట్టిన నిర్మాణాలనే నేడు కాంగ్రెస్ ప్రజాపప్రతినిధులు ప్రారంభిస్తున్నారన్నారు. కార్యక్రమంలో తలారి పరమేశ్, మల్లేపల్లి అనిల్‌కుమార్, తలారి వెంకన్న, అంబటి ప్రవీణ్, అఖిల్, వరప్రసాద్, యాదయ్య, దుబ్బ రాజు పాల్గొన్నారు.