కొండమల్లేపల్లి, డిసెంబర్ 04 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడవ విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. గురువారం కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. నామినేషన్ కేంద్రంలో నోటిఫికేషన్, నామినేషన్ వేసేందుకు వచ్చే వారికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రూపొందించిన ఫ్లెక్సీ బ్యానర్, ఆ క్లస్టర్ పరిధిలో గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు, డిజిటల్ క్లాక్ తదితర వివరాలను రిటర్నింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.
కుల ధ్రువీకరణ పత్రం డిక్లరేషన్లో తీసుకున్న పక్షంలో నామినేషన్ల పరిశీలన సమయం వరకు ఒరిజినల్ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించే విధంగా చెప్పాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఏవైనా సందేహాలు వస్తే ఆర్డీఓ లేదా పై అధికారులతో నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆమె వెంట రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తాసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ స్వర్ణలత ఉన్నారు.