మర్రిగూడ, నవంబర్ 27 : ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాతరేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములను గుంటల లెక్కన అమ్ముతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ చేసి అమ్మితే గ్రామ పంచాయతీకి 10శాతం భూమిని కేటాయించాల్సి రావడమే కాకుండా నిబంధనలను పాటించాల్సి వస్తుందని గుట్టుచప్పుడు కాకుండా గుంటల లెక్కన అమ్మేస్తున్నారు. మర్రిగూడ మండలంలోని అంతంపేటలో ఇప్పుడు ఇదే తరహా వ్యాపారం నడుస్తున్నది. గుంటకు 4లక్షల నుంచి 4లక్షల 50వేల వరకూ అమ్ముతూ వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు.
అంతంపేట నుంచి గట్టుప్పల్‌కు వెళ్లే రోడ్డు వెంట సర్వే నంబర్ 24లో గల రెండెకరాల వ్యవసాయ భూమిని లేఅవుట్ చేయకుండానే గుంటల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేట్ సర్వేయర్ ద్వారా పేపర్‌పై నమూనా లేఅవుట్‌ను తయారు చేసి కస్టమర్లకు చూపిస్తూ అమ్ముతున్నారు. ప్లాట్లన్నీ అమ్ముడుపోయాక ప్లాట్లకు రాళ్లు నాటి రోడ్లు వేస్తామని చెపుతూ విక్రయిస్తున్నారు. ఆ లేఅవుట్లో 20 ఫీట్ల రోడ్డుతో కూడిన 18ప్లాట్లను రూపొందించారు. ఇటు కస్లమర్లను మోసం చేయడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అక్రమ వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వ్యవసాయ భూమిని వెంచర్‌గా మార్చాలంటే మొదటగా నాలా కన్వర్షన్ చేయించి డీటీసీపీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులకు ప్రభుత్వానికి చలానా కట్టాల్సి వస్తుంది. నిబంధలనల ప్రకారం గ్రామ పంచాయతీకి 10శాతం భూమిని కేటాయించి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, పార్క్‌ను ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించాలి. ఇవేమీ లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.