నల్లగొండ, డిసెంబర్ 20 : కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలపై నిత్యం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను భయపెట్టే కుట్రలో భాగంగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు పెట్టారని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు.
ఈ-రేసింగ్ అనేది ప్రపంచ ఈవెంట్లల్లో భాగమని, చాలా రాష్ర్టాలు అంతర్జాతీయ స్థాయిలో తమ కీర్తిని చాటుకోవడానికి ఇలాంటి రేసింగ్స్ నిర్వహిస్తాయని తెలిపారు. అందులో భాగంగానే కేటీఆర్ హైదరాబాద్‌లో ఈ-కార్ రేస్ నిర్వహించారని, దీనికి అప్పట్లో కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారని చెప్పారు. కేటీఆర్ ఒక మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి తెచ్చినట్లు తెలిపారు. లగచర్ల, మూసీ, హైడ్రాలపై ప్రశ్నిస్తున్న కేటీఆర్‌ను ఎలాగైనా జైలుకు పంపాలనే కుట్రతోనే రేవంత్ అక్రమ కేసు పెట్టించినట్లు ఆరోపించారు.
ఈ-రేస్ కోసం డబ్బులను హెచ్ఎండీఏ ఇస్తే సదరు సంస్థ తీసుకున్నదని, అలాంటప్పుడు అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని అన్నారు. నిబంధనల ప్రకారం చేయలేకపోవచ్చు కానీ తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రొసీజర్ ప్రకారం చేయాల్సింది అధికారులని, దీనికి కేటీఆర్‌కు సంబంధం ఏంటో చెప్పాలని అన్నారు. నిజంగా కేటీఆర్ తప్పు చేస్తే దీనిపై అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టం లేదని ప్రశ్నించారు.
కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ఇలాంటి కేసులను ఎదుర్కోవడంతోపాటు ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలను బయట పెడుతామని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున రెడ్డి, నాయకులు కటికం సత్తయ్య గౌడ్, మాలె శరణ్యారెడ్డి, బోనగిరి దేవేందర్, దేప వెంకట్ రెడ్డి, ఐతగోని యాదయ్య గౌడ్, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, కొండూరు సత్యనారాయణ, మారగోని గణేశ్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, తుమ్మల లింగస్వామి పాల్గొన్నారు.