నల్లగొండ, ఆగస్టు 7 : నల్లగొండ జిల్లాలో 2023-24 వానకాలంలో 65 శాతం, యాసంగిలో 51 శాతం సీఎంఆర్ పూర్తి చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కమిషనర్ డీఎస్ చౌహాన్ బుధవారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏయే జిల్లాల నుంచి ఎంతవరకు సీఎంఆర్ డెలివరీ పూర్తయిందని, ఇంకా పెండింగ్లో ఎంత ఉందని ఆయా జిల్లాల డీఎస్ఓలు, డీఎంలతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎస్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండలోనే వానకాలం 65శాతం, యాసంగిలో 51శాతం సీఎంఆర్ పూర్తి చేసినట్లు తెలియచేయడంతో మంత్రి ఉత్తమ్ అభినందించారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30లోపు సీఎంఆర్ పూర్తి చేయడంతోపాటు 2022-23 యాక్షన్ ప్యాడీ లిఫ్టింగ్ను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రికి ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీఎం సివిల్ సైప్లె నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.