సూర్యాపేట, జూలై 21 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షానికి ఎండుముఖం పట్టిన పత్తి, వేరుశనగ, కంది తదితర ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. వరి వేసే రైతులకు ఊరట కలిగించింది. వర్షాభావ పరిస్థితులతో ఇన్నాళ్లు నదుల్లో నీళ్లు లేకపోవడం, బోర్లు, బావులు అడుగంటి పోవడంతో వానల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి ఈ వర్షం మేలు చేసేలా ఉన్నది.
ఇప్పటికే వరి నార్లు పోసిన రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వానకాలంలో భారీ వర్షాలు లేకపోవడంతో సీజన్ ప్రారంభమై నెల దాటినా జిల్లాలో దాదాపు 80 శాతం చెరువులు, కుంటలు నీళ్లు లేక ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కూడా ఓ మోస్తరు తప్ప భారీగా లేదు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తేనే వరి పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత వర్షాలతో సూర్యాపేట జిల్లాలో 82,653 ఆరుతడి పంటలకు ఊతం వచ్చినట్లయ్యింది.
జూన్‌లో కురవాల్సినవి జూలైలో..
దాదాపు ఏడేండ్ల తర్వాత రైతన్నలకు కష్టం దాపురించింది. వర్షాలు లేకపోవడంతో జిల్లాకు ఇరు పక్కల గోదావరి, కృష్ణా జలాలు రాకపోవడంతో ఈ ఏడాది వ్యవసాయం సజావుగా సాగడం లేదు. జూన్ మాసంలో చిరుజల్లులు మాత్రమే కురువగా జూలైలో సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దాంతో ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ రెండో వారం వరకు వేసిన ఆరుతడి పంటలు వేసవిని తలపించే రీతిన కొట్టిన ఎండలకు ఎండు ముఖం పట్టాయి. అనేక చోట్ల రైతులు ట్యాంకర్లతోపాటు దూర ప్రాంతాల నుంచి పైపులు వేసి తమ పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు.
జూన్‌లో కురువాల్సిన వర్షాలు జూలై సగం పూర్తయినా నామమాత్రంగానే పడుతున్నాయి. ఈ వానకాలంలో సూర్యాపేట జిల్లాలో 75,230 ఎకరాల్లో పత్తి, 955 ఎకరాల్లో కందులు, 2,140 ఎకరాల్లో పెసర, వేరుశనగతోపాటు తదితర ఆరుతడి పంటలు మొత్తం 82,653 ఎకరాల్లో వేయగా దాదాపు 80 శాతం పంటలు వర్షాలు లేక ఎండు ముఖం పట్టాయి. ఈ దశలో ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. జిల్లా పెద్ద ఎత్తున వరి సాగు చేయాల్సి ఉండగా కాల్వలో సాగు నీరు రాక, చెరువుల్లో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటి పోయింది. దాంతో చాలా వరకు రైతులు వరినారు పోసి నాట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 65శాతానికి పైనే నాట్లు పూర్తి కావాల్సి ఉండగా ప్రస్తుతం 10 శాతం కూడా నాట్లు పడలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
రైతులు అధికారుల సూచనలు పాటించాలి
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఆరు తడి పంటలకు ఊతం వస్తున్నది. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు రైతులు ఎరువులు, పురుగుల మందులు వాడాలి. ఈ వర్షాలు వరికి కూడా ఉపయోగపడతాయి. ఇక జిల్లా వ్యాప్తంగా వరినాట్లు ఊపందుకోనున్నాయి.
– శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి