కట్టంగూర్, జూన్ 30 : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడి నిధులు రూ.6.56 లక్షలతో నిర్మించిన మౌలిక వసతుల మరమ్మతు పనులను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనంతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫామ్ అందించడంతో పాటు విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం ఉంటాయన్నారు. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు.
విద్యార్థులు ప్రతి విషయాన్ని ప్రణాళికయుతంగా ఆలోచించి ఆచరించాలన్నారు. ఏకాగ్రతతో చదివితే మరింత ముందుకు వెళ్లగలరని సూచించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య, మాజీ జడ్సీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, హెచ్ఎం ఇందిరాదేవి, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, నాయకులు బచ్చులపల్లి గంగాధర్ రావు, రెడ్డిపల్లి సాగర్, మిట్టపల్లి శివ, మర్రి రాజు, ఐతగోని నర్సింహ్మ, శేఖర్, ఐతగోని ఝూన్సీ, మేడి విజయ్ పాల్గొన్నారు.