నీలగిరి, జూన్ 27: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు చుక్కల మందు వేస్తారు. జిల్లాలో 1,47,218 మంది చిన్నారులను గుర్తించారు. 1,335 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి నలుగురు పోగ్రాం అధికారులు, 5,422 మంది సిబ్బందిని నియమించారు. 111 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించారు. 41 మొబైల్ టీములు, 25 ట్రాన్సిస్ట్లను ఏర్పాటు చేశారు.
బస్టాండ్, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. పోలియో రహిత సమాజం కోసం కేంద్ర రా్రష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు యేటా రెండు రెండుసార్లు చుక్కల మందు వేస్తూ పోలియో నివారణకు కృషి చేస్తున్నారు. జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లు, 8 మున్సిపాలిటీలతో కలిపి 147218 మంది 5 సంవత్సరాల్లోపు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. వారికి వ్యాక్సిన్లు వేసేందుకు సంబందిత ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో నిల్వ ఉంచారు.
సిబ్బంది నియామకం..
జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మొత్తం 5503 మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. జిల్లాలోని 147218 మంది చిన్నారులకు చుక్కలమందు వేసేందుకు జిల్లా యంత్రాంగం జిల్లాను ఐదు ప్రాంతాలుగా విభజించి, ముగ్గురు డిప్యూటీ డీఎంహెచ్వోలు, ఐదుగురు ప్రోగ్రాం అధికారులు, 63 మంది మెడికల్ అఫీసర్లు, 78 మంద స్టాఫ్‌నర్సులు, 135మంది సూపర్వైజర్లు, 428 వైద్యఆరోగ్య సిబ్బంది, 1448 ఆశా కార్యకర్తలు, 2033 అంగన్వాడీలను నియమించింది. వీరితోపాటు 1310 మంది నర్సింగ్ విద్యార్థుల సహకారం కూడా తీసుకోనున్నారు.
41 మొబైల్ బృందాల ఏర్పాటు..
సంచార జాతులు, ఇటుక బట్టీలు, మురికి వాడలు, నిర్మాణ రంగ పనులు, చేపలు పట్టే ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రాంతాలు జిల్లాలో 111 ఉన్నట్లు గుర్తించారు. వీటిని హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి చుక్కల మందు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతాల్లో 3921 ఇండ్లు ఉన్నట్లు గుర్తించి, ఆ ఇండ్లలో 844 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. మొబైల్ బృందంలో పీహెచ్సీ వైద్యులు, నలుగురు సిబ్బంది వెంట ఉంటారు. చుక్కల మందు వేసేందుకు 25 ట్రాన్సిట్ బృందాలను కూడా నియమించారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పోలియో కేంద్రాల్లో చిన్నారులకు చుక్కల మందు వేస్తారు. అనంతరం 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చిన్నారులను గుర్తించి చుక్కల మందు వేస్తారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు విధిగా తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలి. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్ధలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలి. జిల్లాలోని నాలుగు రెవిన్యూ డివిజన్లలో నలుగురు ప్రోగ్రాం అధికారులను నియమించాం.
– డా.రాహుల్, నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి