సూర్యాపేట, సెప్టెంబర్ 1 (నమస్తేతెలంగాణ) : దేశంలోనే తెలంగాణను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అక్కసుతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ లేనిపోని అభాండాలు మోపి కేసును సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా భగ్గుమన్నది. పన్నెండు నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సూర్యాపేట జిల్లా పరిధిలో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పిలుపు మేరకు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో కాళేశ్వరం జలాలతో తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేసి, అనంతరం రాస్తారోకో చేపట్టారు. నేరేడుచర్లలో బీఆర్ఎస్ శ్రేణులు కోదాడ-మిర్యాలగూడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నల్లగొండ జిల్లా పరిధిలోని కొండమల్లేపల్లిలో నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో నల్లజెండాలు, బ్యాడ్జీలతో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మను దహనం చేయగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. హాలియాలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నేతృత్వంలో నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, చౌటుప్పల్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ తీసి, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమ్మయ్యగౌడ్, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా అద్యక్షుడు రామకృష్ణారెడ్డి పాల్గొని కాళేశ్వరం జలాలతో తెలంగాణ తల్లికి జలాభిషేకం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
తెలంగాణ ద్రోహి రేవంత్
తుంగతుర్తి, సెప్టెంబర్ 1 : ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం తుంగతుర్తిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం చేసి, అనంతరం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు, మోదీ డైరెక్షన్లోనే కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని, అసెంబ్లీ సాక్షిగా మాజీమంత్రి హరీశ్‌రావు బహిర్గతం చేశారని, అది జీర్ణించుకోలేని ప్రభుత్వం ఆయన మైక్ కట్ చేసి మాట్లడనివ్వకుండా చేసిందన్నారు. రాష్ట్రం లో నడిచేది ప్రజా ప్రభుత్వం కాదని ఛోటే భాయ్.. బడే భాయ్ పాలన అన్నారు. తెలంగాణ కోసం ఏనాడూ జైలుకు వెళ్లని, కనీసం జై తెలంగాణ నినాదం కూడా చేయని తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ.50 లక్షలతో అడ్డంగా దొరికి, జైలుకెళ్లిన ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. రేవంత్.. తస్మాత్ జాగ్రత్త..ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజా క్షేత్రంలో వారే నీకు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు గుజ్జ యుగంధర్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, ఎస్కే రజాక్, రఘునందన్‌రెడ్డి, కలెట్లపెళ్లి ఉప్పల్లయ్య, గుండగాని సోమేశ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములుగౌడ్, దొంగరి శ్రీనివాస్, తునికి సాయిలు, తడకమళ్ళ రవికుమార్, గునిగంటి సంతోష్, గోపగాని రమేశ్, గోపగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.