చండూర్, నవంబర్ 12 : ఆయిల్‌పామ్ సాగు రైతులకు లాభదాయకం అని మునుగోడు నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ అన్నారు. చండూర్ మండలం పుల్లేంల గ్రామంలో ఉద్యాన శాఖ, పీఏసీఎస్ చండూర్ ఆధ్వర్యంలో బుధవారం రైతులతో ఆయిల్‌పామ్ పంట సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆయిల్‌పామ్ మొక్కలు ఒక్కసారి నాటితే పంట దిగుబడి 4వ సంవత్సరం నుండి మొదలై 35 సంవత్సరాల పాటు ప్రతి నెల ఆదాయం వచ్చే ఏకైక పంట ఆయిల్ పామ్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండలం కొండాపురంలో ఇప్పటికే పంట దిగుబడులు ప్రారంభం అయినట్లు చెప్పారు.
ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం పెద్దఎత్తున సబ్సిడీలు ఇస్తుందని తెలిపారు. రూ.200 విలువ గల మొక్కను కేవలం రూ.20కే ఇస్తున్నట్లు వెల్లడించారు. డ్రిప్ పరికరాలు కూడా ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఓసీ రైతులకు 80 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు పంట వేసిన తర్వాత మొక్కలు పెంచినందుకు ఒక్కో ఎకరాకు రూ.4,200 నాలుగు సంవత్సరాల పాటు ఇస్తుందన్నారు. ఇప్పటికే చండూర్ మండలంలో 85 మంది రైతులు 280 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు సాగుచేస్తున్నట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో 1,600 ఎకరాల్లో సాగు జరుగుతుందన్నారు. పాల చౌడు నేలలు తప్పా నీరు ఉన్న ప్రతీ రైతు ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు అన్నారు. ఒక ఎకరం వరి సాగు అయ్యే నీటితో సుమారు 3 ఎకరాల వరకు ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చు అన్నారు.
మార్కెట్ సమస్య కూడా లేదన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో బై బ్యాక్ అగ్రిమెంట్ కూడా ఉంటుందన్నారు. కాబట్టి ఆయిల్ పామ్ ద్వారా ఇప్పటికే వేసిన రైతులు చెప్పిన ప్రకారం ఎకరానికి సుమారు రూ.లక్ష నుండి రూ.1.50 లక్షల వరకు నికర ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చండూర్ మండల ఏఓ చంద్రిక, పుల్లెంల క్లస్టర్ ఏఈఓ అనూష, పీఏసీఎస్ చండూర్ సీఈఓ అమరేందర్, చండూర్ పతంజలి ఆయిల్ పామ్ ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్, హెచ్ఈఓ శ్రీను, మనోహర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఇరిగి బుచ్చయ్య, నర్సింహా, నజీర్, అంజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Chandur : ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు : రావుల విద్యాసాగర్