సూర్యాపేట, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక ఊర్లు తిరిగిన మాజీ సీఎం కేసీఆర్ తాను గుర్తించిన ప్రతీ సమస్యకు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారం చూపారు. గ్రామాలు, పట్టణాల్లో శ్మశానవాటికలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో రూ.3.59 కోట్లతో సద్దుల చెరువు కట్ట పక్కన హిందూ శ్మశాన వాటికను మహాప్రస్థానం పేరుతో నిర్మించారు. రూ.4.50 కోట్లతో జమునానగర్ పక్కన హిం దూ శ్మశానవాటిక, రూ.1.50 కోట్లతో ముస్లింలకు ఖబ్రస్థాన్, రూ. 50 లక్షలతో క్రిస్టియన్ సమాధుల తోట, పట్టణంలో రూ.5.28 కోట్లతో పట్టణంలోని కుడకుడ, దురాజ్‌పల్లి, ఖాసీంపేట, నల్లచెరువుతండా, సైనిక్‌పురి కాలనీ, బుర్కపిట్టతండా, పుల్లారెడ్డి చెరువు పక్కన, మామిళ్లగడ్డ, పిల్లలమర్రి, గాంధీనగర్, బీబీగూడెం, చంద్రన్నకుంట, భగత్‌సింగ్‌నగర్, నెహ్రు నగర్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికలను అభివృద్ధి చేశారు.
బీఆర్ఎస్ పాలనలో స్వర్గధామాలుగా వెలుగొందిన శ్మశానవాటికలు నేడు అస్తవ్యస్తంగా మారాయి. పట్టణంలోని పలు శ్మశాన వాటికలు నరకప్రాయంగా మారాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలన లో కొత్తవి ఏర్పాటు చేయకపోగా ఉన్నవాటిని సంరక్షించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. సూర్యాపేటలోని యాదవ శ్మశాన వాటిక సమస్యలతో సతమతమవుతోంది. ఇందులో మొత్తం కంపచెట్లు నిండిపోవడంతో దహనవాటికలు కనిపించడంలేదు. కర్మకాండలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చుట్టూ ప్రహరీ ఉన్నప్పటికీ గేటుకు తాళాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు బోరు మోటారును చోరీ చేశారు. చావులకు వచ్చినవారు, బంధువులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నిర్వాహకులను బతిమాలుకొని మున్సిపాల్టీ నుంచి ట్యాంకర్ నీటిని శ్మశానవాటిక వద్దకు తెప్పించుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శ్మశాన వాటికల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఎదురు చూడాల్సిందే..
మా బంధువు చనిపోవడంతో యాదవ శ్మశాన వాటికకు వచ్చాం. ఇది కంపచెట్లతో నిండిపోయింది. దహనం చేసే ఘాట్లు కంపచెట్లతో నిండిపోయాయి. ఆడవారు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన గదులకు తలుపుల్లేవు. దుర్గంధం వెదజల్లుతోంది. బోరు మోటారు పాడైంది. ట్యాంకర్ వస్తేనే స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
– పిల్లి భాగ్యమ్మ, సూర్యాపేట
వాటర్ ట్యాంకరే గతి
యాదవ శ్మశాన వాటికలో అన్నీ సమస్యలే. బీఆర్ఎస్ ప్రభుత్వం శ్మశాన వాటిక చుట్టూ గోడ నిర్మించింది. ఆడవారు దుస్తులు మార్చుకునేందుకు, స్నానం చేసేందుకు గదులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతంఎవరూ పట్టించుకోవడం లేదు. బోరుకు మోటారు లేదు. ట్యాంకర్‌కు ఫోన్ చేస్తే గంటల పాటు దాటవేస్తున్నారు. శ్మశానవాటికలో కంపచెట్లను తొలగించాలి.
– కాసనబోయిన ఉపేందర్, సూర్యాపేట