– మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి
– రెండో రోజు కొనసాగిన ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ కళాశాల బంద్
రామగిరి, నవంబర్ 04 : ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు దీర్ఘకాలికంగా (4 సంవత్సరాలుగా) పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ప్రైవేట్ కళాశాలల నిర్వధిక బంద్ మంగళవారం రెండో రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో కొనసాగింది. దీనిలో భాగంగా తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ (TPDPMA–MGU) నాయకులు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ యూనివర్సిటీ వద్ద ధర్నాతో పాటు నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టసాధ్యంగా మారిందని, సిబ్బందికి జీతాలు చెల్లించడంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న నాలుగు సంవత్సరాల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో టీపీడీపీఎంఏ ఎంజీయూ అధ్యక్షుడు టి.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి హనుమంతు యాదవ్, ఉపాధ్యక్షుడు సుభాష్ రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యులు మారం నాగేందర్ రెడ్డి, డాక్టర్ బి.నర్సింహారెడ్డి, ఉమ్మడి జిల్లాలను వివిధ కళాశాల యాజమాన్యాలు ధనుంజయ, ఎం.వెంకట్ రెడ్డి, శ్రీనాథ్, నగేశ్, అనిల్, సుధాకర్, ఇతర మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.

Ramagiri : ఎంజీయూలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన