మిర్యాలగూడ, అక్టోబర్ 24 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామనుకునే సరికి గిట్టుబాటు కాక నష్టపోతున్నారు. కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, పట్టించుకోవాల్సిన అధికారులు పత్తా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. దాంతో రైస్ మిల్లర్లు సిండికేట్‌గా మారి ఒక రేటు నిర్ణయించి, అదే ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. గ్రేడ్-1 సన్న ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320తోపాటు రూ.500 బోనస్ ఉండగా.. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, పరిసర ప్రాంతాల రైస్ మిల్లర్లు మాత్రం రూ.2,200 నుంచి రూ.2,400 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు.
ప్రారంభం కాని ఐకేపీ కేంద్రాలు
ప్రభుత్వం రైతులకు కింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలోనే ప్రకటించింది. కానీ గత యాసంగి కొనుగోళ్లలో బోనస్ ఇవ్వలేదు. ప్రస్తుతం వానకాలం కూడా కేవలం సన్నరకం ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని కొర్రీ పెట్టింది. నల్లగొండ జిల్లాలో ఐకేపీ కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభించకపోవడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో మిల్లుల వద్దే ధాన్యం విక్రయించాల్సి వస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి సన్న ధాన్యం తీసుకొచ్చి మిర్యాలగూడ రైస్ మిల్లుల వద్ద మిల్లర్లు చెప్పిన ధరకే అమ్ముకొని వెళ్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే మద్దతు ధర రూ.2,320తోపాటు బోనస్ రూ.500 కలిపి కింటాకు రూ.2,820 వస్తుంది. కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడం, ప్రారంభించిన చోట కూడా కొనుగోళ్లు చేపట్టక పోవడం వల్ల రైతులు మిల్లుల వద్దే ధాన్యం అమ్ముకోవాల్సి వస్తున్నది.
మిల్లులకు అమ్మిక ధాన్యానికి బోనస్ లేకపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు మిర్యాలగూడ రైస్ మిల్లర్లు సిండికేట్‌గా మారి కింటాకు రూ.2,200 నుంచి రూ.2,400 వరకే ధర చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టులో వరి కోతలు ఇంకా ప్రారంభం కాలేదు. నల్లగొండ, తిప్పర్తి, నకిరేకల్, సూర్యాపేట, రామన్నపేట, మునుగోడు ప్రాంతాల నుంచి మిర్యాలగూడకు ధాన్యం వస్తున్నది. ఇంత దూరం తీసుకురావడం వల్ల ట్రాక్టర్ కిరాయి అధికంగా చెల్లించాల్సి రావడంతోపాటు ధరలో కూడా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ సమీపంలోని ఓ మిల్లుకు నకిరేకల్‌కు చెందిన రైతు రెండు ట్రాక్టర్లలో 80 కింటాళ్ల ధాన్యాన్ని తీసుకురాగా, ధర రూ.2,200 మాత్రమే దక్కింది. రామన్నపేటకు చెందిన మరో రైతు 50 కింటాళ్ల ధాన్యం రూ.2,250కి పెట్టారు. నాణ్యత లేదు, తేమ ఎక్కువ ఉందంటూ కుంటిసాకులు చెప్పి తక్కువ ధరకు అడుగుతున్నారని, విధిలేని పరిస్థితిలో అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు.
మిల్లు పాయింట్ల వద్ద బోనస్ లేక నష్టం
రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తేనే బోనస్ చెల్లిస్తామని మెలిక పెట్టింది. హైబ్రీడ్ రకాలైన పూజ, చింట్లు, హెచ్ఎంటీ, కావేరి వంటి సన్నరకం ధాన్యం పండించిన రైతులు ఎక్కువగా మిల్లుల వద్దే విక్రయిస్తుండడంతో బోనస్ నష్టపోవాల్సి వస్తున్నది. మిల్లు పాయింట్ల వద్ద విక్రయించిన వారికి కూడా ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తేమ శాతంలో సడలింపు ఇస్తేనే సన్న ధాన్యం విక్రయాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతులు అత్యధికంగా సన్నధాన్యం పండిస్తున్నారు. ఈ రకం ధాన్యాన్ని 24 నుంచి 29 శాతం తేమ ఉన్నప్పుడే మిషన్ల ద్వారా వరిని కోసి నేరుగా మిల్లుల వద్ద విక్రయిస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో కూడా తేమ శాతం సడలింపు ఇస్తేనే రైతులు సన్నధాన్యం అమ్ముకునే పరిస్థితి ఉంటుందని రైతులు చెప్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ధాన్యం ఆరబెట్టే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 17శాతం తేమ రావాలంటే ధాన్యాన్ని 7 నుంచి 10 రోజులు ఆరబెట్టాల్సి రావడంతో కూలీల సమస్య వల్ల రైతులు విధిలేని పరిస్థితుల్లో మిల్లులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం తేమ శాతంలో సడలింపు ఇస్తేనే ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతు శ్రేయస్సే ధ్యేయమని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తేమ శాతంలో సడలింపు ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.