కట్టంగూర్, అక్టోబర్ 14 : గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధన శక్తి పెరుగుతుందని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. మంగళవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, అశ్రిత స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌష్టికాహారమే సంపూర్ణ ఆర్యోగానికి మూలమని, సమతుల ఆహారం ద్వారా సుస్థిర ఆరోగ్యం సాధ్యమన్నారు. దేశ భవిష్యత్ అయిన పిల్లలు, తల్లుల ఆరోగ్యం పరిరక్షణకు పోషణ అభియాన్ ఒక మహత్తర కార్యక్రమని, గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పౌష్టికాహార పదార్థాల ప్రదర్శనను ఏర్పాటు చేసి వాటి ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం విద్యార్థులకు బాల్య వివాహాలు, ఫౌష్టికాహారంపై వ్యాస రచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు శారదరాణి, పద్మావతి, ఆశ్రిత సంస్థ ప్రతినిధి ఝూన్సీ, వైద్యాధికారులు ప్రియాంక, ఎం.రాంరెడ్డి, ఫార్మాసిస్ట్ విజయ్‌కుమార్, ఏఎన్ఎం ఉదయ, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.