నమస్తే తెలంగాణ, నెట్వర్క్ : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు సమాయత్తమవుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్టు చేశారు. కొన్నిచోట్ల ఆందోళనలకు పిలుపునివ్వకున్నా పండుగ పూట ఉదయాన్నే ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్థానిక పోలీస్స్టేషన్లకు తరలించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగింది. హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్నందునే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడుతుందని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు. ప్రజా పాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా, అక్రమ నిర్బంధాలు చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.