నకిరేకల్, జూన్ 24 : మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సరైన వసతులు కల్పించలేదని అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కుర్చీలు వేయలేదని, మంచినీటి సౌకర్యం కల్పించలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి తమ సమస్యలు చెప్పుకొనేందుకు 42 మంది అర్జీదారులు రాగా.. సమావేశ మందిరంలో మూడు కుర్చీలు మాత్రమే వేశారు.
దాంతో అర్జీదారులు నేలపైన, అరుగుల మీద, చెట్ల కింద కూర్చుని దరఖాస్తులు రాసే పరిస్థితి నెలకొంది. ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో మంచినీళ్ల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. సమావేశ మందిరంలో అధికారుల కుర్చీల వెనుక భాగంలో ఉన్న చాంబర్లో వాటర్ క్యాన్లను ఉంచారు. కార్యాలయ బయ ట ఆవరణలో ఉంచాల్సిన వాటర్ క్యాన్లను ఆఫీస్ చాంబర్లో పెడితే తాము ఎలా తాగాలని అర్జీదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ చంద్రశేఖర్‌కు రెండు మార్లు ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయలేదు.