– నిందితుడు కృష్ణారెడ్డిపై కేసు నమోదు
కోదాడ, మార్చి 14 : అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కొందరు ఇదే అదునుగా భావించి అధిక ధరలకు అమ్ముకునేందుకు అక్రమంగా నిల్వ చేసి సొమ్ము చేసుకుంటున్న తీరు కోదాడలో శనివారం వెలుగులోకి వచ్చింది. కోదాడ పట్టణంలో అంబేద్కర్ కాలనీలో ఓ వ్యక్తి తన ఇంట్లో 44 సిలిండర్లు అక్రమంగా నిల్వ చేశాడు. ఈయనతో పాటు పట్టణంలోని ఓ రెస్టారెంట్లో మరో నాలుగు డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న విషయాన్ని విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా పౌర సరఫలాల అధికారి మోహన్ బాబు నేతృత్వంలో సిబ్బంది రైడ్ చేసి పట్టుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో కృష్ణారెడ్డి ఇంటిలో 44 గ్యాస్ సిలిండర్లతో పాటు, ఫుడ్ ప్లాజా రెస్టారెంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మరో నాలుగు గ్యాస్ సిలిండర్లను పౌరసరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కృష్ణారెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సదరు సిలిండర్లను స్థానిక శ్లోక గ్యాస్ ఏజెన్సీకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో జిల్లా అధికారితో పాటు కోదాడ సివిల్ సప్లయ్ డిప్యూటీ తాసీల్దార్ రామిరెడ్డి, సూర్యాపేట, కోదాడ సివిల్ సప్లయ్ శాఖ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కృష్ణారెడ్డి. శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. వినియోగదారులు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్యపరంగా వినియోగించవద్దని, ఎవరైనా అక్రమంగా సిలిండర్లు నిల్వ ఉంచితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు హెచ్చరించారు.