నేరేడుచర్ల, డిసెంబర్ 16 : మూడో విడత పోలింగ్‌లో భాగంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోరాహోరీగా సాగే ఈ పోరులో అభ్యర్థుల భవితవ్యం బుధవారం సాయంత్రంతో తేలనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది. మూడో దశ పోలింగ్ ప్రశాంత వాతావారణంలో నిర్వహించేలా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం పలు మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల వద్ధ ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సామగ్రిని సిబ్బందికి అందజేశారు. మధ్యాహ్నం అనంతరం తమకు కేటాయించిన గ్రామాలకు పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో ఆయా పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో వెళ్లిపోయారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు, హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెంలో 1,92,617 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగంచుకోనున్నారు. వీరిలో పురుషులు 93658 మంది, మహిళలు 98952 మంది, ఇతరులు 7గురు ఉన్నారు.
నియోజకవర్గంలో మొత్తం 146 గ్రామ పంచాయతీలు ఉండగా 22 గ్రామ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా కాగా 124 మంది బరిలో ఉన్నారు. 1318 వార్డులు ఉండగా 257 వార్డులు ఏకగ్రీవమయ్యా యి. మిగిలిన 1061 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఓట ర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 1176 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 45 రూట్లుగా విభజించి 50 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. 45 మంది రిటర్నింగ్ అధికారులు, స్టేజ్ -2 అధికారులు 147 మంది ఉన్నారు. 1538 మంది పీవోలు, 2026 మంది వోపీవోలను నియమించారు. వీరంతా తమ ఎన్నికల సామగ్రిని తీసుకోని మంగళవారం సాయంత్రమే ఆయా గ్రామాలకు చేరుకొన్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 1 గంటలకు ముగియనుంది. రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి గెలుపొందిన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకొంటారు. మొదటగా వార్డుల వారీగా ఓట్లు లెక్కించి ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
