స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థులు మొదటి నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు వలస ఓటర్లపై ఫోకస్ పెట్టా రు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను పోలింగ్ రోజు రప్పించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచితీరాని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఓవైపు చలి గజ గజ వణికిస్తుండగా.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంతో రాజకీయం వేడెకుతున్నది. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సమరం ఊపందుకున్నది. ఎలాగైనా గెలిచేందుకు అభ్యర్థులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఎన్నికల్లో తమకు ఓట్లు వేసేందుకు చక్రం తిప్పుతున్నారు. ఓటేసేందుకు తప్పకుండా రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకయ్యే రానుపోను ఖర్చు భరిస్తామని హామీ ఇస్తున్నారు. కొందరు స్పెషల్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. ఇప్పటికే తొలి విడత పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరినేది తేలింది. రెండు, మూడో విడత కూడా తుది దశకు చేరుకుంది. ఇప్పటికే అన్ని రాజీకీయ పార్టీల మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల తేదీ కూడా దగ్గర పడుతున్నది. ఈ నెల 9న సాయంత్రం తొలి విడత ప్రచారం ముగుస్తుంది. 11న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారా యి. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకంకానుంది. ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారం ఇతర పనుల పేరుతో అనేక మంది హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉంటున్నారు. ముఖ్యంగా భువనగిరి, ఆలేరు, పోచంపల్లి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, మోతూర్, రామన్నపేట, వలిగొండ, తురపల్లి, బొమ్మలరామారం తదితర మండలాలకు చెందిన అనేక మంది ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. వీళ్లంతా పండుగలు, పబ్బాలకు మినహా సొంతూర్లకు పెద్దగా రారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు కావడంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లపై కూడా లీడర్లు దృష్టి పెట్టారు. ఏయే ప్రాంతాల్లో ఉన్నారు? ఎవరు ఉన్నారు? ఎంత మంది ఉన్నారు? అనే లెకలు తీశారు. ఓటరు జాబితా, ఫోన్ నంబర్లు సేకరించి, రెగ్యులర్గా కాల్ చేస్తున్నారు. తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. గ్రామానికి సంబంధించిన ఓటర్లు ఫలానా చోట అధికంగా ఉంటే ఆయా పార్టీల నుంచి ప్రత్యేకంగా మనుషులను పంపించి వారిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓటర్లకు గాలం వేసేందుకు అభ్యర్థులు, నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. పోలింగ్ శాతం పెరిగితే అనుకూలమైన ఫలితాలు వస్తాయని భావిస్తూ.. ఇతర ప్రాంతాల్లో ఉన్న అందరినీ రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తమకు కచ్చితంగా ఓటు పడుతుందనుకుంటే ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడటం లేదు. ఓటర్లను రప్పించే క్రమంలో సొంతూర్లకు రవాణా సదుపాయం కల్పిస్తామని కొందరు అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. నలుగురు, ఐదుగురుంటే కారు పంపిస్తామని చెప్పుకొస్తున్నారు. ఇంకొందరికి రానుపోను ఖర్చులు భరిస్తామని చెబుతున్నారు. ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. కొందరు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఇస్తామని ముందే చెప్పి పెడుతున్నారు. ఎన్నికలు రసవత్తరం గా మారితే ఓటు విలువ పెరిగే అవకాశం ఉంది. ఎకువ ఓట్లు ఉంటే గుండుగుత్తగా మాట్లాడేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో పలు బృందాలు రంగంలోకి దిగాయి. పల్లెల్లో సైతం దావత్లు షురూ అయ్యాయి. సాయంత్రం కాగానే ఎకడికకడ పార్టీలు నడుస్తున్నాయి.