సిటీబ్యూరో, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందనీ డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతిబసు, మస్తాన్ ఆందోళన వ్యక్తం చేశారు. డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల సంఖ్యను భారీగా తగ్గించడం సరికాదన్నారు. సోమవారం ఐ అండ్ పీఆర్ కార్యాలయం ఎదుట డీజేఎఫ్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఐ అండ్ పీఆర్ అధికారులు జగన్‌కు వినతిపత్రం అందించారు. ఈ ధర్నాకు టీడబ్ల్యూజేఎఫ్, టీయూడబ్ల్యూజే, టీయూడబ్ల్యూజే(143), హెచ్‌యూజే మద్దతు ప్రకటించాయి. గతంలో ప్రతి జిల్లాకు ఐదుగురు జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు వచ్చాయన్నారు. కానీ నేడు ఎడిషన్ సెంటర్‌కు నాలుగు అక్రిడిటేషన్లు మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టడం దారుణమన్నారు.
ఈ నిబంధనతో వందలాది మంది డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఒక్కో ఎడిషన్‌లో మూడు నుంచి ఆరు జిల్లాలున్నాయని, వాటికి అనుగుణంగా అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటీకి కూడా ఆరు కార్డులే ఉన్నాయని, ఇక్కడ కనీసం 17 నుంచి 18మంది పనిచేస్తున్నారని తెలిపారు. పైగా ఇప్పుడు హైదరాబాద్ మూడు కమిషనరేట్లుగా మారడంతో పేజీలు కూడా పెరుగుతాయన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ ఆలీ, టీయూడబ్ల్యూజే(143) ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, కోశాధికారి యోగి మాట్లాడుతూ పాత పద్ధతిలోనే కార్డులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాల్సిందేననీ టీడబ్ల్యూజేఎఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి గండ్ర నవీన్ అన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనలో డీజేఎఫ్టీ చేసే భవిష్యత్ పోరాటలకు అన్ని సంఘాలు అండగా ఉంటాయని నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీజేఎఫ్టీ నాయకులు దొడ్డి శేఖర్, ఓగోటి కిరణ్‌కుమార్, పెద్దిరెడ్డి విజయ, లలిత తదితరులు పాల్గొన్నారు.