నల్లగొండ, అక్టోబర్ 19: బీఆర్ఎస్ హయాం లో పార్టీలకు అతీతంగా నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇప్పుడు అధికార పార్టీ హస్త ముద్రికలతో నడుస్తోంది. కొన్ని ప్రాంతా ల్లో మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి హాకా, మ్యాక్స్ పేరుతో కొత్త అవతారం ఎత్తి ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధమైంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల ద్వారానే కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ సానభూతిపరుల ద్వారానే కొనుగోళ్లు చేపడుతున్నారు. ప్రధానంగా జిల్లా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ నియోజకవర్గంలో ఐకేపీలను నిర్వీర్యం చేసి హాకా, మ్యాక్స్ పేరుతో ఒక్కొక్క రు రెండు, మూడు ప్రాంతాల్లో సెంటర్లు ఓపెన్ చేసి ధాన్యం కొంటుండటం గమనార్హం. పదేం డ్ల ధన దాహం తీర్చుకునే పనిలో భాగంగానే కొత్త సంఘాల పేరుతో అవతారం ఎత్తి మహిళలకు రావాల్సిన కమీషన్ సైతం నొక్కే ప్రయ త్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఆలోచనతో 2006 నుంచే అప్పటి పాలక ప్రభుత్వం ఐకేపీ పేరుతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో రెండు సంఘ బంధాలు ఏర్పాటు చేసి, ఒక ఏడాది ఒక సంఘబంధం, మరో ఏడాది మరో సంఘ బంధం ధాన్యం కొనుగోళ్లు చేసేది. పదేండ్ల బీఆర్ఎస్ సర్కార్‌లో కూడా అదే జరిగింది. అయితే ఈసారి నల్లగొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ సంఘబంధాలు మాత్రమే కొనుగోలు చేయాలని, గత కొనుగోళ్లతో సంబంధం లేదని స్థానిక ఎమ్మెల్యేలు అధికారులకు ఆదేశాలు జారీ చేయటంతో అవే అమలవుతున్నాయి. అయితే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సీరియల్స్‌తో సంబంధం లేకుండా అధికార పార్టీ నేతల ధాన్యం కుప్పలనే ముందుగా తూకం వేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు విషయంలో కొత్త చట్టం అమలవుతుంది. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక అడుగు ముందుకేసి కొత్త అవతారం ఎత్తి ఐకేపీలకు ధాన్యం కొనుగోలు నిర్వహణ ఇవ్వవద్దని..మా ప్రభుత్వంలో మేమే కొంటామన్నారు. అయితే ఐకేపీతో కాకుండా కొత్త సంఘాల ద్వారా ఇవ్వాలని మంత్రికి సూచించినట్లు సమాచారం. దీంతో సహకార శాఖ ద్వారా నల్లగొండ నియోజకవర్గంలో హాకా పేరుతో …రాముల బండ, పిట్టలగూడెం, నర్సప్పగూడెం, చర్లపల్లి బైపాస్, చెన్నుగూడెం, జీ చెన్నారం గ్రామాల్లో కొత్త సెంటర్లు ఇస్తే..మ్యాక్స్ పేరుతో రెడ్డికాలనీ, చందనపల్లి, పజ్జూర్, ఖాజీరామారం, వెంకటాద్రి పాలెం గ్రామాల్లో ఐకేపీలకు రాంరాం చెప్పి కొనుగోళ్లు ప్రారంభించారు. వీటికి కలెక్టరేట్ నుంచ్ అనుమతి ఇచ్చారని..తమకు ఏ సంబంధం లేదని అధికారులు చెప్పటం విశేషం.
నల్లగొండ జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 375 కేంద్రాలు ప్రారంభిస్తామని..అవసరమైతే మరో 25 కేంద్రాలు కూడా ఓపెన్ చేస్తామని చెప్పిన అధికారులు 346 మాత్రమే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటికి సంబంధించిన మెటీరియల్‌ను కూడా పంపించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే వాటిలో ఇప్పటి వరకు 157 కేంద్రాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. మొత్తం 375 కేంద్రాల్లో ఐకేపీ 151, పీఏసీఎస్ 174(హాకా,మ్యాక్స్‌తో కలిపి), ఎఫ్‌పీవో-21 కేంద్రాలు..అంటే మొత్తం 346 మాత్రమే ఉండగా…375 అనటం గమనార్హం. అయితే ఐకేపీలు మొత్తం 130 కంటే ఎక్కువ ఓపెన్ చేయటం లేదని సమాచారం.