పెన్పహాడ్, ఏప్రిల్ 16 : పోలీస్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా బుధవారం పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. స్టేషన్ రికార్డును, స్టేషన్ పరిసరాలు, వివిధ రకాల నేరాల్లో స్వాధీనం చేసుకోబడిన వాహనాలు, ఫిర్యాదుల నమోదు, ప్రాథమిక దర్యాప్తు మొదలగు అంశాలను పరిశీలించారు. అలాగే సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డయల్ 100 ఫిర్యాదులు, పోలీసు స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలపై త్వరగా స్పందించాలని ఆదేశించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టంగా పని చేయాలన్నారు. గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను ప్రణాళికతో అమలు చేయాలన్నారు, గ్రామ పోలీస్ అధికారులు గ్రామాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుగా సమాచారం వచ్చేలా సమాచార వనరులు వృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతిరోజు గ్రామాలను సందర్శిస్తూ ప్రజలకు సన్నితంగా ఉంటూ పోలీస్ సేవలను అందించాలన్నారు.
మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణాను సమర్థవంతంగా నిరోధించాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేసి రవాణా చేసే వారిని బైండోవర్ చేయడం, వాహనాలు సీజ్ చేయడం లాంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు. గంజాయి రవాణా చేసిన కేసుల్లో ఉన్న నిందితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి వారి కదలికలను నమోదు చేయాలన్నారు. జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవాలని, సామాజిక అంశాల గురించి వివరించాలని, నేరాలకు పాల్పడితే చట్ట పరిధిలో శిక్షలు అనుభవించాల్సి వస్తుందని తెలుపాలన్నారు.
సమస్యలు సృష్టించే వారిని గుర్తించి వారిలో మార్పు వచ్చేలా చూడాలన్నారు. దొంగతనాలు జరగకుండా ప్రజల్లో భద్రతా పరమైన చైతన్యం తేవాలన్నారు, కొత్త వ్యక్తులు, అనుమానస్పద వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే ఆశ్రయం ఇవ్వవద్దని, పోలీసు వారికి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామాల్లో ప్రజలు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, స్థానిక ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.