పెన్పహాడ్, డిసెంబర్ 13 : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్ సిబ్బంది సమన్వయంతో ప్రణాళిక ప్రకారం పని చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శనివారం రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల బందోబస్తుకు పెన్పహాడ్ మండల పరిధిలో విధులకు హాజరౌతున్న సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకం అన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వహించాలని తెలిపారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన ప్రాంతాలను వదలవద్దు అన్నారు. 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏరమైనా వెంట తెస్తున్నారా అనేదానిపై నిఘా ఉంచాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వార్డు, సర్పంచ్ అభ్యర్థులు, అనుమతి కలిగిన ఏజెంట్లను మాత్రమే లోనికి అనుమతించాలన్నారు.
ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల నిర్వహణలో సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు లేదా ఆకస్మిక సమస్యలు ఎదురైతే, వాటిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల భద్రత అనేది ఒక సమష్టి బాధ్యత అని, దీనిని విజయవంతం చేయడంలో సిబ్బంది పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ రాజశేఖర్, ఇన్స్పెక్టలర్లు కాస్తల గోపికృష్ణ, శ్రీకాంత్ గౌడ్, ఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Penpahad : పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలి : ఎస్పీ కె.నరసింహ