నల్లగొండ సిటీ, సెప్టెంబర్ 10 : దళిత బాలికపై అత్యాచార యత్నం కేసులో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. కనగల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌పై అదే గ్రామానికి చెందిన సుఖేందర్ అనే యువకుడు ఈ నెల 5న అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. గణేష్ నిమజ్జనోత్సవం చూడడానికి వచ్చిన బాలికకు సైగ చేసి తన నెంబర్ చెప్పి ఫోన్ చేయాలని తెలిపాడు. బాలిక నిరాకరించడంతో సుఖేందర్ ఆమె నోరు మూసి పక్కనే ఉన్న బాత్రూమ్లోకి బలవంతంగా లాక్కెళ్లాడు.
దీంతో బాలిక కేకలు వేసింది. అవి విని బాలిక అన్న వచ్చి సుఖేందర్‌తో గొడవపడ్డాడు. సుఖేందర్ తన స్నేహితులైన మన్నెం రాంబాబు, సోమచందుకు ఫోన్ చేసి పిలిపించాడు. వారు వచ్చి బాలిక కుటుంబ సభ్యులతో గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు మంగళవారం రాత్రి కనగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును అనుసరించి నిందితుడు సుకేందర్పై పోక్సో కేసు నమోదు చేయగా, సుఖేందర్ స్నేహితులైన రాంబాబు, సోమచందుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజీవ్‌రెడ్డి తెలిపారు.