మొక్కలపై మమకారంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఇంటిని వివిధ రకాల పండ్ల మొక్కలతో తోటలా మార్చాడు. సాధారణంగా ఎవరైనా తమ ఇంటి ఆవరణలో స్థలాన్ని బట్టి పండ్లు, పూలు, నీడ నిచ్చే మొక్కలు ఓ పది, ఇరవై పెంచడం చూస్తాం. కానీ, ఈ ఉపాధ్యాయుడు ఏకంగా తన ఇంటి ఆవరణతోపాటు ఇంటిపైన వందకు పైగా మొక్కలను పెంచుతున్నాడు. అతనే సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రానికి చెందిన కనకం నగేశ్.
– చివ్వెంల, ఏప్రిల్ 24 పిచ్చుకలకు ప్రత్యేక గూళ్లు
మొక్కలను చీడపీడల నుంచి కాపాడేందుకు పక్షులు ఉండాలని భావించి ఇంటి వసారాలో పిచ్చుకలు చేరేందుకు ప్రత్యేకంగా అట్టపెట్టెలతో గూళ్లు తయారు చేశాడు. మొక్కలపైన చిన్న చిన్న పురుగులు కనిపిస్తే వాటిని పిచ్చుకలు తింటాయని వాటిని ఏర్పాటు చేశాడు. ఈ గూళ్లను పిచ్చుకలు ఆవాసాలుగా మార్చుకుని అక్కడే ఉండడమే కాకుండా తెల్లవారుజామున నిద్ర లేపేందుకు తోడ్పడుతున్నాయని, వాటి రాగాలు వినసొంపుగా ఉంటాయని చెబుతున్నాడు. పిల్లల ఆటవిడుపు కోసం మూడు తొట్లు ఏర్పాటు చేసి వాటిల్లో రంగు రంగుల చేపలు పెంచుతున్నాడు.
నగేశ్ ప్రస్తుతం ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. 2009లో సూర్యాపేటలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న క్రమంలో మొక్కలు నాటాలి, అడవులను సంరక్షించాలి అని విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కానీ, తాను ఆచరించకపోతే ఎలా? అని తనకు తాను ప్రశ్నించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి ఉన్నప్పటి పాత ఇంటిని ఓ నందన వనంలా మార్చాడు. రెండు సంవత్సరాలుగా నూతనంగా నిర్మించిన ఇంటి ఆవరణలో అనేక జాతుల మొక్కలు సేకరించి సంరక్షిస్తున్నాడు. ఇంటి ఆవరణలో సరిపడా స్థలం లేకపోవడంతో టెర్రస్‌పై ప్రత్యేకంగా ప్లాస్టిక్ డ్రమ్ములు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నాడు.
రాష్ట్రంలో ఎక్కడా కనిపించని మొక్కలు..
మొక్కలపై అతనికి అమితమైన ప్రేమ ఉండడంతో రాష్ట్రంలో దొరకని మొక్కలను ఇతర రాష్ర్టాల నుంచి సేకరిస్తుంటాడు. హైదరాబాద్‌లో సంవత్సరానికి ఒకసారి జరిగే నర్సరీ మేళాకు వెళ్లి అక్కడ నుంచి సేకరిస్తుంటాడు. కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ర్టాల నుంచే కాకుండా బంగ్లాదేశ్, బ్రిటన్, యూరప్ దేశాల నుంచి ఆన్లైన్లో మొక్కలు సేకరించి వాటిని సంరక్షిస్తుంటాడు. సేకరించిన మొక్కలను సేంద్రియ పద్ధతిలో పెంచుతుంటాడు. వాటికి సారవంతమైన ఎర్రమట్టి, నల్లమట్టి, కోడిగుడ్ల పొట్టు, చెక్క పొట్టు, బొగ్గుతో అందిస్తుంటాడు.
పలువురికి ఆదర్శంగా నిలువాలన్నదే నా లక్ష్యం
పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిని నేనే ఆదర్శవంతంగా ఉండకపోతే ఎలా? అని నేను చేసే పనిని చూసి పది మంది నన్ను ఆదర్శంగా తీసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నా. మొక్కల కోసం ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ నర్సరీ మేళాకు వెళ్లి కొత్త మొక్కలు సేకరిస్తా. మొక్కల సంరక్షణ కోసం సామాజిక మాధ్యమాల్లో మెళకువలు నేర్చుకుంటా. నేను మొక్కలు పెంచే విధానాన్ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటా. నా కుటుంబ సభ్యులు పెస్టిసైడ్స్‌తో పండించిన పండ్లు తినొద్దనే ఉద్దేశంతో మొక్కలు పెంచుతున్నా. ఇంటికి వచ్చిన అతిథులు, బంధువులు, స్నేహితులకు మొక్కలను బహుమానంగా ఇస్తుంటా.
-కనకం నగేశ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, చివ్వెంల