రామగిరి, అక్టోబర్ 15 : డీఎస్సీ-2024లో ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు విద్యా శాఖ గందరగోళంతో తీవ్ర అవస్థలు పడ్డారు. నల్లగొండలోని డైట్ సమావేశ మందిరంలో మంగళవారం పాత పద్ధతిలో ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తామని జిల్లా విద్యాశాఖ నుంచి సోమవారం అభ్యర్థులకు ఫోన్లు వెళ్లాయి. దాంతో మంగళవారం ఉదయం 10 గంటల వరకే అభ్యర్థులు డైట్‌కు చేరుకోగా, విద్యాశాఖ అధికారులు కౌన్సెలింగ్ వాయిదా పడిందని తాపీగా బదులిచ్చారు. దాంతో అభ్యర్థులు ఇంటికి వెనుదిరిగారు. కొంత సమయం తర్వాత కౌన్సెలింగ్ ఈ రోజే ఉంటుందని మళ్లీ జిల్లా విదాశాఖ నుంచి అభ్యర్థులకు ఫోన్ చేశారు. దాంతో అభ్యర్థులు హుటాహుటిన మార్గమధ్యం నుంచే వచ్చేశారు. ఈ గందరగోళం నడుమ జిల్లా అదనపు కలెక్టర్ టి.పూర్ణచందర్ డీఈఓ భిక్షపతితో కలిసి మధ్యాహ్నం 2 గంట తర్వాత కౌన్సెలింగ్‌ను ప్రారంభించగా, అర్ధరాత్రి వరకూ సాగింది. అనంతరం అభ్యర్థులకు పాఠశాలలను కేటాయిస్తూ ఉత్తర్వులను అందజేశారు.
ప్రభుత్వం, విద్యాశాఖ నిర్వాకంతో డీఎస్సీ అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. చంటి పిల్లలలో వచ్చిన వారు అర్ధరాత్రి వరకు అక్కడే ఉండాల్సి వచ్చిం ది. అరకొర వసతుల మధ్య తమ నెంబర్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తూ కూర్చున్నారు. కనీసం తాగు నీటి కూడా కల్పించ లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 8:30గంటల వరకు కేవలం ఎస్జీటీ ప్రభుత్వ విభాగం, స్కూల్ అసిస్టెంట్ అన్ని కేడర్‌లో కౌన్సిలింగ్ పూర్తి చేశారు. వారికి ఉత్తర్వులు ఇవ్వడానికి రా త్రి అయింది. లోకల్ బాడీ విభాగం ఎస్జీటీ కౌన్సెలింగ్ అర్ధరాత్రి వరకు సాగింది. ఆయా కేటగిరీల్లో 535మందికి పోస్టింగ్ ఉత్తర్వులు అందించారు. ఉత్తర్వులు పొందిన వారంతా బుధవారం పాఠశాలలో రిపోర్ట్ చేయాలని చెప్పడంతో అంతా ఆందోళనలో ఉన్నారు.
ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు విద్యాశాఖ ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురుకాలేదు. తాజీగా డీఎస్సీ అభ్యర్థులకు మాత్రం పాత పద్ధతిలో ప్రత్యేక్ష కౌన్సిలింగ్ నిర్వహించడంలో అంతర్యమేంటని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆన్లైన్ వెబ్ కౌన్సెలింగ్ చేసి ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కావని అభ్యర్థులు వాపోయారు.