‘ఏరు దాటిన దాక ఓడ మల్లయ్య… దాటాక బోడి మల్లయ్య’ చందాన్ని తలపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన తీరు. అధికారం కోసం అడ్డదిడ్డంగా హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ… గద్దెనెక్కినాక కొత్త పథకాలు ఏమో కానీ ఉన్న పథకాలకు మంగళం పాడుతున్నది. ఆరు గ్యారెంటీల అమలు పేరుతో అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గర పడుతున్నా నేటీకి వాటి అతీగతీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ఒక్కటి అమలు చేస్తూ… దాన్నే ఏడాది కాలంలో ఊదరగొడుతుండడం విశేషం. ఇక 200 యూనిట్ల ఉచిత కరెంట్, గ్యాస్ సిలిండర్‌కు 500రూపాయల రాయితీ పథకాలు కూడా అసంపూర్తిగానే అమలవుతున్నాయి. ఇక మిగిలిన ఏ పథకమూ ఆచరణలోకి రాలేదు. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా అమలు చేస్తూ వచ్చిన రైతుబంధును పక్కన పెట్టేశారు. రైతుభరోసాగా పేరు మార్చినా కార్యరూపం దాల్చలేదు. రుణమాఫీ సగంలోనే ఆగిపోయింది. ఇక 4 వేల పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు రూ.2,500 పథకం ఇంకా ఎన్నో హామీలు నేటికీ అడ్రస్సు లేకపోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్.. ఏడాది ప్రజా పాలన పేరుతో విజయోత్సవాల నిర్వహణకు సిద్ధపడడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ)
అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, తొలి ఏడాదిలోనే 2లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాటలన్నీ ఉత్తవేనని తేలిపోయింది. రోజులు గడుస్తున్నా కొద్దీ ఇది మాటల ప్రభుత్వమేనని, చేతల ప్రభుత్వం కాదని తేటతెల్లమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది కాలంలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులేమీ లేకపోగా ఉన్నవాటిని ముందుకు తీసుకుపోవడంలో వైఫల్యం చెందారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో గత కేసీఆర్ సర్కార్ హయాంలో రైతుబంధు పథకం ద్వారా సుమారు 11 లక్షల మంది రైతులకు ప్రతి సీజన్లో రూ.1,300 కోట్ల వరకు పెట్టుబడి సాయం అందేది. దీన్ని ఎకరాకు రూ.7,500 చొప్పున పెంచి ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ యాసంగిలో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన సొమ్మునే ఇవ్వగా… వానకాలంలో అసలుకే ఎగనామం పెట్టింది.
వానకాలంలో రైతుభరోసాగా ఉమ్మడి జిల్లా రైతులకు రూ.2,000 కోట్ల వరకు అందాల్సి ఉంది. కానీ రైతుభరోసా సీజన్ ముగిసినా ఇవ్వకుండా గాలికి వదిలేసింది. ఇక యాసంగిలో సైతం ఇస్తారన్న గ్యారెంటీ ఏమీ కనిపిస్తలేదు. దీంతో రైతులు ఈ సీజన్లో పంటల పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీని సైతం అర్ధాంతరంగా నిలిపివేశారు. ఉమ్మడి జిల్లాలో నేటికి రెండున్నర లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. మూడు విడుతల్లో కలిపి కూడా 50శాతం మంది రైతులకే రుణమాఫీ జరిగింది. గత ఆగస్టు 15వ తేదీ నుంచి నేటి వరకు ఒక్క రైతుకు కొత్తగా రుణమాఫీ కాలేదు. రేషన్‌కార్డు లింక్ పెట్టి కుటుంబాలను లెక్కించి లబ్ధిదారులను తగ్గించే కుట్రలను చేసింది. దీంతో వేలాది మంది రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. వీరికి ఎప్పటికీ రుణమాఫీ అవుతుందనేది ప్రభుత్వ పెద్దలు చెప్పడం లేదు.
ఈ సీజన్లో నాగార్జునసాగర్‌లో గేట్ల మీద నుంచి నీళ్లు దూకుతున్నా… ఏఎంఆర్పీ ఆయకట్టుకు సకాలంలో సాగునీరు ఇవ్వలేకపోయారని ఎన్నోసార్లు రైతులు రోడ్లెక్కారు. ఏఎంఆర్‌పీలో ఓ మోటార్ రిపేర్ వస్తే దాని పూర్తి చేసేందుకు 9 నెలల సమయం పట్టడంతో రైతులు సాగునీటి కోసం తండ్లాడి తీవ్రంగా నష్టపోయారు. సాగర్ ఎడమ కాల్వకు గండి పడితే 20 రోజుల తర్వాత మరమ్మతులు పూర్తి చేస్తే 30వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. గత యాసంగిలో భూగర్భ జలాలు పడిపోతే సాగర్‌లోని నీటిని వాడుకుని చెరువులు నింపే అవకాశం ఉన్నా… పట్టించుకోలేదు. దీంతో వందలాది ఎకరాల్లో పండ్ల తోటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు.
ఏడాది ప్రజా పాలన విజయోత్సవాల పేరుతో ప్రభుత్వం వేడుకల నిర్వహణకు సిద్ధపడింది. ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల రెండో వారం వరకు నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా నేడు నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో విజయోత్సవాల సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి మంత్రులు హాజరువుతున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్సవాల పట్ల సామాన్య ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఆసక్తి చూపడం లేదన్నది నిజం. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజలు పాలన పట్ల సంతృప్తి లేకుండా… విజయోత్సవాలు ఏమిటన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తున్నది. ఇక సామాన్య ప్రజలు, వివిధ వర్గాలు, రైతులు, ఉద్యోగులు సైతం విజయోత్సవాల పట్ల పెదవి విరుస్తూ విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆచరణలో వైఫల్యం చెంది, ప్రచారంలో ఆర్భాటం ఎందుకన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే యాసంగి ధాన్యానికే రూ.500 బోనస్ అని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. యాసంగి ధాన్యం బోనస్కూ ఎగనామం పెట్టారు. వానకాలంలో ఇస్తామని చెప్పి అందులోనూ పెద్ద తిరకాసు పెట్టారు. అత్యధిక రైతులకు ప్రయోజనం కలిగే దొడ్డురకం వడ్లను వదిలేసి కేవలం సన్నాలకు మాత్రమే బోనస్ అని ప్రకటించారు. ఆ సన్నాలు కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితేనే అని లింక్ పెట్టారు. సన్నాలు ఎన్నడూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన దాఖలాలు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకునే బోనస్‌కు ఎగనామం పెట్టేలా నిబంధనలు పెట్టి రైతులను మోసం చేస్తున్నారు. ఇక దొడ్డురకం ధాన్యాన్ని సైతం సకాలంలో కొనుగోళ్లు జరుపకపోవడంతో రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.2వేలకే క్వింటాలు చొప్పన నేరుగా మిల్లర్లకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక పత్తి పంటల కొనుగోలు సైతం చిత్రవిచిత్ర నిబంధనలతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఆలస్యంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెట్టి, తేమశాతం నిబంధనలతో రైతులను దళారులకే పత్తి విక్రయించేలా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఏకైక పథకం మహిళలకు ఉచిత బస్సు మాత్రమే. ఉచిత బస్సు పేరుతో పథకాన్ని ప్రారంభించి నల్లగొండ రీజియన్ పరిధిలోని అనేక రూట్లలో బస్సులను రద్దు చేశారు. ఇక ఉన్న బస్సుల్లో కిక్కిసిరిపోయి ప్రయాణికులు విసుగు చెందే పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపైనా ప్రజల్లో సంతృప్తి మాత్రం కనిపిస్తలేదు. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ రాయితీ పథకాలు అమలు చేస్తున్నా… ఇంకా వేలాది మంది అర్హులు వీటికి దూరంగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల వల్ల కొత్తగా అర్హులను నమోదు చేసుకునే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామన్న పథకం నేటీకి అడ్సస్సు లేదు. రూ.4వేలకు పెన్షన్ల పెంపు ఊసేలేదు. ఎప్పుడిస్తారో దీనిపై మాట్లాడే వారే కనిపిస్తలేరు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అధికారంలోకి రాగానే రెండు డీఏలు ఇస్తామని చెప్పి ఒక్క డీఏతోనే సరిపెట్టారు. ఇలా పెండింగ్‌లో ఉన్న డీఏలు ఐదుకు పెరుగడం విశేషం. రిటైరైన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ ఏడాది కాలంలో ఒక్కరికీ ఇవ్వలేదు. ఇక వేతనాల సవరణ గురించి చర్చే లేదు. ఇలా ఎన్నో పథకాలు కార్యరూపం దాల్చలేదు.