పెన్పహాడ్, సెప్టెంబర్ 20 : గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఆసరా పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ పెన్పహాడ్ మండలంలో వివిధ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు పింఛన్దారులు శనివారం వినతి పత్రాలు అందజేశారు. మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం వికలాంగుల పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ అనంతారం, పొట్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయాలను దివ్యాంగులు ముట్టడించారు. గత 20 నెలలుగా పింఛన్లు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు రూ.6 వేలు, ఇతర పింఛన్లను రూ.4 వేలకు పెంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల పోరాట సమితి గ్రామ శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షుడు కొండేటి గోపి మాదిగ, మామిడి నాగార్జున, మామిడి రమేశ్ పాల్గొన్నారు.