పెన్పహాడ్, ఆగస్టు 06 : దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు ఇచ్చి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని సూర్యాపేట డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం, దోసపహాడ్, నాగులపహాడ్, నారాయణగూడెం, అన్నారం, అనంతారం, పెన్పహాడ్ పాఠశాలలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం తప్పా, అన్ని రకాల బిల్లులు, ఐదు డీఏలు, పీఆర్సీ పెండింగ్లో ఉంచిందన్నారు.
బెనిఫిట్స్ విడుదల చేయకపోవడంతో రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులు, డీఏలు విడుదల చేసి, పీఆర్సీని అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు బదిలీలతో కూడిన పదోన్నతలు షెడ్యూలు ఇవ్వకుండా పదోన్నతుల షెడ్యూలు విడుదల చేయడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నకిరేకంటి రవి, కొచర్ల వేణు, జిల్లా మాజీ అధ్యక్షుడు దశరథ రామారావు, మండల ప్రధాన కార్యదర్శి ఉమర్, నరేందర్, ఆనంద్ భాస్కర్ పాల్గొన్నారు.