నేరేడుచర్ల, నవంబర్ 18 : ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు ఎంతో కృషి చేస్తున్నామని పాలకులు, ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకుంటుంటున్నారు. కానీ కిందిస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన వాతావరణం ఉంది. బీఆర్ఎస్ హయాంలో దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు కల్పించి వారికి భరోసా కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం సరైన నిఘా పెట్టకపోవడంతో సిబ్బంది ఆడిందే ఆట…. పాడిందే పాటగా మారింది. కనీసం ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు కావాల్సిన సరైన మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది తీరే ఇందుకు నిదర్శనం.
మంగళవారం మధ్యాహ్నం పాలకవీడు మండలంలోని అలింగాపురం గ్రామానికి చెందిన తేలం కోటేశ్వరరావును కుక్క కరిచింది. వెంటనే వైద్యం కోసం ఆయన 15 కిలోమీటర్ల దూరం నుంచి నేరేడుచర్ల పీహెచ్సీకి వస్తే వైద్యులు, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. ఆయనతోపాటు జ్వరాలతో బాధపడుతూ వైద్యం కోసం దవాఖనకు వచ్చిన మరికొంతమంది రోగులు కూడా సిబ్బంది, డాక్టర్ కోసం పడిగాపులు కాశారు. కనీసం సిబ్బంది కూడా లేకపోవడంతో వారు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఇక్కడి దవాఖానలో పని చేసే సిబ్బంది అందరూ తాళం వేసి మిర్యాలగూడలో జరిగే పీహెచ్సీ వైద్యాధికారి సోదరుడి ఫంక్షన్(దావత్)కు వెళ్లారు. వైద్యురాలు మాత్రం విధులకు సెలవు పెట్టింది. దవాఖాన పని మీద సూర్యాపేటకు వెళ్లివచ్చిన అటెండర్ మాత్రం తాళాలు తీసి ఒక్కడే కూర్చున్నాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.