త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీ సైతం ఎన్నికలకు సమాయత్తమవుతున్నది. భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నది. కేడర్‌ను సిద్ధం చేస్తున్నది. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళ్లనాల పేరుతో పెద్దఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నది.
ఇప్పటికే పలు జిల్లాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాయి. సమావేశాల్లో ముఖ్య అతిథులుగా హాజరయ్యే నేతలు భవిష్యత్‌లో గెలుపు కోసం అనుసరించాల్సిన అంశాలపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనున్నారు. గులాబీ శ్రేణు ల్లో మరింత ఉత్సాహం నింపనున్నారు.
ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా ఈ నెల 2న భువనగిరిలో సమావేశం నిర్వహించనున్నారు. పట్టణ పరిధిలోని సాయి కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీనికి మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు. సమ్మేళనానికి పార్టీ సీనియర్ నేతలతోపాటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, మండల, గ్రామ కమిటీలు, పార్టీ మహిళా, యువజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగం నేతలు పాల్గొననున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు సమ్మేళనం జరుగనున్నది. మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఆలేరు నియోజకవర్గంలో ఫిబ్రవరి 4న ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరుగనున్నది. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ నెల 29వ తేదీనే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాల్సి ఉండగా, పలు కారణాలతో వాయిదా పడింది.లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది.
భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇందుకోసం అన్ని రకాల ఎత్తుగడలకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజక వర్గాల్లోని అసెంబ్లీల పరిధిల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నది. ఫిబ్రవరి 4న భువనగిరి, 4న ఆలేరులో ఆత్మీయ సమ్మేళనాలను చేపట్టనున్నది. దీనికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై కూడా ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలోని రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిన విషయం తెలిసిందే. కేడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ఎక్కడ లోపాలు జరిగాయి..? ఎలా సరిదిద్దుకోవాలి..? పార్టీని మరింత బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టనున్నది. హస్తం పార్టీ హామీలను తుంగలో తొక్కుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేయనున్నది.
లోక్‌సభ ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. 2న భువనగిరి, 4న ఆలేరులో నిర్వహిస్తు న్నాం. ఎలాగైనా భువనగిరి ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ గెలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. కేడర్‌లో మరింత ఉత్సాహం నింపుతాం. ఆహ్వానం ఉన్నోళ్లందరూ తప్పకుండా హాజరై విజయవంతం చేయాలి.
– కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు