సూర్యాపేట రూరల్, సెప్టెంబర్ 12 : గురుకుల పాఠశాలలో తమ పిల్లలకు రావాల్సిన సీట్లు పక్కదారి పడుతున్నాయని, పైరవీ ఉంటేనే సీట్లు ఇస్తున్నారని సూర్యాపేట మండలం ఇమాంపేట సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. దురాజ్‌పల్లి -మిర్యాలగూడెం రహదారిపై ధర్నా నిర్వహించారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుపకుండా స్పాట్ అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టారని మండిపడ్డారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించి 5 నుంచి 9 వ తరగతి వరకు గురుకుల హాస్టళ్లలో సీట్లు 99 ఖాళీగా ఉంటే 3 వేల మందిని ఎందుకు పిలిచారని అన్నారు. ఉదయం 2 సీట్లు, మధ్యాహ్నం 45 సీట్లు, ఆ తరువాత 99 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారని, అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించే అధికారులు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే లెటర్లు ఉన్నాయా? అని అడుతున్నారని చెప్పారు.
పైరవీలు ఉంటేనే సీట్లు ఇస్తారా అని ప్రశ్నించారు. ఉదయం 8 గంటల నుంచి జ్వరంతో బాధపడుతున్న పిల్లలతో తిండి తిప్పలు లేక సీటు వస్తుందనే ఆశతో పాఠశాలకు వచ్చామని, సాయంత్రం 6గంటలవుతున్నా క్లారిటీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్మిషన్ల ప్రక్రియ సక్రమంగా నిర్వహించి తమ పిల్లలకు న్యాయం విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.