Minister Komatireddy Venkat Reddy | నల్గొండ కల్చరల్ (రామగిరి), మార్చి 2 : సమాజానికి దిక్సూచి పంచాంగం. హిందూ ధర్మ సాంప్రదాయాల్లో ఏ శుభకార్యాలు నిర్వహించాలన్న పంచాంగంలోని తిథులు, ఘడియల ఆధారంగానే నిర్ణయించడం జరుగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు అన్నారు.
నల్గొండ జిల్లా జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం, జిల్లా తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రముఖ పురోహితులు, సిద్ధాంతి, పెన్నా మోహన్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ కర్త బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి రచించిన శ్రీ విశ్వాసు నామ సంవత్సర 2025- 26 పంచాంగాన్ని.. ఇవాళ హైదరాబాద్లో మంత్రులు వేర్వేరుగా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా పెన్నా మోహన్ శర్మ ప్రతి సంవత్సరం పంచాంగాలను రూపొందించి బ్రాహ్మణ సమాజానికి అందించడం హర్షనీయమన్నారు. బ్రాహ్మణ అర్చకులకు ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ధూప దీప నైవేద్య పథకంలో పనిచేస్తున్న అర్చకులు అందరికీ ప్రతినెల గౌరవ వేతనాలను ప్రభుత్వము అందచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పెన్నా మోహన్ శర్మతో పాటు ఆయన వెంట ప్రముఖ సిద్ధాంతి పంచాంగ కర్త దివిజ్ఞాన సిద్ధాంతి తదితరులు ఉన్నారు.
ఈ నెల 4న నల్గొండలో పంచాంగ వితరణ..
రాష్ట్ర మంత్రులతో ఆవిష్కరించిన శ్రీ విశ్వాస నామ సంవత్సర పంచాంగ వితరణ కార్యక్రమం ఈ నెల 4న మంగళవారం నల్గొండలోని రాక్ హిల్స్ కాలనీలో నిర్వహిస్తున్నట్లు పంచాంగ రూపకర్త జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం నల్గొండ అధ్యక్షులు పెన్నా మోహన్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3: 15 గంటలకు రాఖీ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో నిర్వహించే కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా బ్రాహ్మణులు, అర్చకులు, పురోహితులు అందరూ హాజరై పంచాంగాలను స్వీకరించాలని కోరారు.