దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి పాలియేటివ్ కేర్ సెంటర్ ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది. నల్లగొండలోని జనరల్ దవాఖానలో గతేడాది ప్రారంభమైన సేవలు బాధితులకు స్వాంతన చేకూరుస్తున్నాయి. ప్రధానంగా క్యాన్సర్‌తోపాటు డయాబెటిస్, టీబీ రోగులకు ఈ కేంద్రంలో చికిత్స చేస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్, క్లోమ గ్రంధి క్యాన్సర్ ఉన్న వారు జీవితకాలం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉండగా తీవ్రమైన నొప్పి నుంచి వారికి పలు చికిత్సతో ఊరట కలిగిస్తున్నారు. ఈ కేంద్రం సేవలను నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1200 మంది వినియోగించుకుంటున్నారు. ఇందులో 960 మందికి పైగా క్యాన్సర్ బాధితులే ఉన్నారు. పాలియేటివ్ కేంద్రంలో ఒక డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, నలుగురు స్టాప్ నర్సులు, ముగ్గురు ఆయాలు, వాహనంతోపాటు డ్రైవర్ అందుబాటులో ఉంటారు. మంచం నుంచి దిగలేని రోగులకు అలన కార్యక్రమం ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్లి వైద్య సేవలు
అందిస్తున్నారు.
నీలగిరి, అక్టోబర్ 12 : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అన్న నానుడి నుంచి స్వరాష్ట్రంలో క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకు సైతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స అందుతున్నది. చిన్న రోగం వచ్చినా పట్నం పోయే స్థితి నుంచి జిల్లా కేంద్రంలోనే వైద్యసేవలు ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువవుతున్నాయి. నల్లగొండలోని జిల్లా ఆసుపత్రి 400 పడకల నుంచి జనరల్ దవాఖానగా అప్‌గ్రేడ్ అయ్యాక అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో గత సంవత్సరం ఏప్రిల్‌లో పాలియేటివ్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఎప్పటికీ నయం కాని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాధి లక్షణాలను తగ్గిస్తూ నొప్పి నుంచి విముక్తి కలిగించేందుకు చికిత్స అందిస్తున్నారు. తద్వారా రోగుల జీవిత కాలాన్ని పెంచడంతోపాటు చివరి వరకు రోగులకు వ్యాధి లక్షణాలతో కలిగే బాధ నుంచి విముక్తి కలిగిస్తారు.
దీర్ఘకాలిక రోగాల బారిన పడి అనేక ఇబ్బందులకు గురవుతున్న బాధితులకు జిల్లా కేంద్రంలోని పాలియేటివ్ కేర్ సెంటర్ అండగా నిలుస్తున్నది. ఆసుపత్రికి వచ్చిన వారికి భరోసా కల్పిస్తూనే మంచంపై ఉన్న వారి ఇంటికే వెళ్లి వైద్యసేవలు అందిస్తూ వారికి స్వాంతన చేకూర్చుతున్నది. జాతీయ ఆరోగ్య మిషన్, వైద్యారోగ్య శాఖ కమిషనర్ పర్యవేక్షణలో ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ పాలియేటివ్ కేర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీల సిబ్బంది సహాయంతో వైద్యురాలు, ఫిజియోథెరపిస్ట్, సిబ్బంది గ్రామాలను సందర్శించి రోగులకు వైద్యసేవలు, మందులు అందిస్తున్నారు. రోగుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని వైద్యాధికారుల లెక్కలు చెప్తున్నాయి. ప్రధానంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండగా, క్లోమ గ్రంధి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. వీరంతా జీవిత కాలంపాటు చికిత్స పొందాల్సి ఉండగా.. వ్యాధి వల్ల తరచూ తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇటువంటి బాధితులకు జనరల్ ఆసుపత్రిలోని పాలియేటివ్ కేర్ సెంటర్లో నొప్పి నుంచి విముక్తి కల్పిస్తున్నారు. ప్రధానంగా డయాబెటిస్, క్లోమ గ్రంధి, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ఆక్యూట్ మైనిటైటీస్ పరిస్థితులు ఉన్న వారికి బాధ నుంచి స్వాంతన కలిగించేందుకు ఫుయిడ్ టాపింగ్ సింప్టమేటివ్ ట్రీట్మెంట్ చికిత్స అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మంచం నుంచి దిగలేని పరిస్థితిలో ఉన్నవారికి సైతం ఆలన కార్యక్రమం ద్వారా ఒక రోజు రోగుల ఇంటి వద్దకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని రోగులకు సైతం ఇంటి వద్దే వైద్యసేవలు అందుతున్నాయి. అయితే.. చాలా మందికి క్యాన్సర్‌పై అపోహలు ఉన్నాయని, అది అంటువ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంటే రోగులను వాహనంలో పాలియేటివ్ కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా జిల్లాలో 1200 దీర్ఘకాలిక రోగులను గుర్తించారు. ఇందులో 960 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉండగా.. వారందరికీ వైద్య సేవలందిస్తున్నారు. పాలియేటివ్ కేంద్రంలో ఒక డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, నలుగురు స్టాఫ్ నర్సులు, ముగ్గురు ఆయాలు, వాహనం, డ్రైవర్‌ను అందుబాటులో ఉంచారు. జిల్లా కేంద్రంలో 8 పడకలతో వార్డు ఫిజియోథెరపీ పరికరాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు.
జనరల్ ఆసుపత్రిలోని పాలియేటివ్ కేర్ సెంటర్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్స అందిస్తున్నాం. ఆసుపత్రికి వచ్చే వారితోపాటు రోజుకో గ్రామాన్ని సందర్శించి రోగుల ఇంటి వద్దకు వెళ్లి వైద్య సేవలందించడంతోపాటు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం. క్యాన్సర్ వ్యాధిపై చాలా మందిలో అపోహాలు ఉన్నట్లు గుర్తించాం. క్యాన్సర్ అంటు వ్యాధి కాదు. ఆసుపత్రిలో ఫిజియోథెరపీ సేవలు కూడా అందిస్తాం. ఈ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తే ఇతరులకు సోకదు. దీనిపై జిల్లాలో విస్తృత ప్రచారం చేస్తున్నాం.