వేలకు వేలు పెట్టుబడి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంటలు పొట్ట దశలో నీళ్లు లేక కండ్ల ముందు ఎండిపోతుండడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. సాగునీరు రాక, భూగర్భజలాలు లేక గోస తీస్తున్నారు. బోర్లు, బావుల నమ్ముకుని శక్తి మేరకు ప్రయత్నించినా, ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఎండుతున్న పంటను విధిలేని స్థితిలో పశువుల మేతకు వదిలిపెడుతున్నారు.
అడ్డగూడూరు/నూతనకల్/తుంగతుర్తి/పెన్‌పహాడ్,, ఫిబ్రవరి 13 : సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. గోదావరి జలాలు రాకపోవడంతో యాసంగిలో సాగు వరి పైర్లు పొట్ట దశలో ఎండిపోతుండడంతో పెట్టుబడి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు మదన పడుతున్నారు. పంటలను కాపాడుకునే పరిస్థితి లేక యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని బొడ్డుగూడెం గ్రామానికి చెందిన వెంపల్ల జన్నపరెడ్డికి చెందిన ఎనిమిదెకరాల వరి పంటను పశువులకు వదిలిపెట్టాడు. తన పొలంలో మూడు బోర్లు ఉన్నా చుక్క నీరు రావడం లేదని జన్నపరెడ్డి ఆవేదన చెందుతున్నాడు. ఎనిమిదెకరాలకు రూ.2లక్షల వరకు పెట్టుబడి అయ్యిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు. ఒక్క బొడ్డుగూడెంలోనే దాదాపు 200 ఎకరాల వరి ఎండిపోయే స్థితిలో ఉండడం బాధాకరం. వెంపల్ల వెంకట్‌రెడ్డి, కేసారపు శ్రీనివాస్‌రెడ్డి, అయిలయ్య, నాగరాజు అనే రైతుల పంటలు ఇప్పటికే ఎండిపోయాయి.
సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో సాబాది భిక్షంరెడ్డి ఎకరం భూమిలో వరి సాగు చేయగా, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు రాకపోవడంతో పంటంతా ఎండిపోయింది. దాంతో పొలంలో బర్రెలను మేపుతున్నాడు. నూతనకల్ మండలంలోని మాచనపల్లి, లింగంపల్లి, నూతనకల్, ఎర్రపహడ్, దిర్శనపల్లి, చిల్పకుంట్ల, మిర్యాల, అల్గునూరు గ్రామాల్లో దాదాపు 300 ఎకరాల వరి పొట్ట దశలో ఎండిపోవడంతో రైతులు జీవాలు, పశువుల మేతకు వదిలిపెట్టారు. తుంగతుర్తి మండలంలోనూ ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీరు అందకపోవడం, ఎండలు తీవ్రం అవుతుండడంతో బోర్లు, బావుల్లోనూ భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దాంతో పంటలు ఎండిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం జలాల ద్వారా ఇక్కడి రైతాంగం రెండు పంటలు పండించేది. కాంగ్రెస్ సర్కారులో కాళేశ్వరం జలాలు అందకపోవడంతో కరువు తాండవిస్తున్నది.
పెన్‌పహాడ్ మండలంలోని నూర్జహాన్‌పేట, జల్మలకుంటతండా, చిన్న సీతరాంతండాలో పంటలు ఎండిపోతున్నాయి. చాలా చోట్ల రైతులు పుట్టెడు దుఃఖంతో రెండు వేలు, మూడు వేలకు గొర్లకాపరులకు జీవాల మేత కోసం అప్పగిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారులో పుట్లకొద్దీ వడ్లు పండించామని, ఎన్నడూ నీళ్లకు ఇబ్బంది లేదని రైతులు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ చిన్నసీతరాంతండాకు చెందిన రైతులు గురువారం మోకాళ్లపై నిలబడి నిరసన తెలపడం గమనార్హం. ఇప్పటికైనా నీళ్లు ఇస్తే ఉన్న కొద్దిపాటి పంటలను కాపాడుకుంటామని ప్రాధేయ పడుతున్నారు.
నాకున్న ఐదెకరాల్లో వరి నాటు పెట్టాను. కాళేశ్వరం నీళ్లు రాకపోవడంతో సాగు కష్టంగా మారింది. ఎండలు ముదరడంతో బోరు, బావిలోనూ నీళ్లు అడుగంటాయి. చేతికి రావాల్సిన పంట పూర్తిగా ఎండిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీ కాల్వలకు విడుదల చేయడంతో రెండు పంటలు పండించాను. ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– యామ రాజశేఖర్, రైతు, బండరామారం గ్రామం, తుంగతుర్తి మండలం