సూర్యాపేట, మే 30 : జిల్లాలో అర్హులైన పేదలకు ఇండ్లు అందేలా చూడాలని రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి చట్టంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లపై ప్రశ్నలు సంధించారు. సంక్షేమ పథకాల్లో లబ్ధ్దిదారుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే చెప్పిందే ఫైనల్ అనేది అధికారులు గుర్తుంచు కోవాలన్నారు.
కలెక్టర్నుంచి అటెండర్ వరకూ జిల్లాలో ఎక్కడా అవినీతి లేకుండా పాలన పారదర్శకంగా జరగాలి. ఏమాత్రం అలసత్వం, అవినీతి జరిగినా ఉపేక్షించేది లేదు. నిరుపేదలకు నిజాయితీగా పథకాలు అందించాలి. త్వరలోనే ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. జిల్లాలో ఉన్న నాలుగు వేల ఎకరాల అటవీ భూమి అన్యాక్రాంతమవుతున్నది. వెంటనే సూర్యాపేట జిల్లా అధికారులు ఆ అటవీ భూములు కాపాడాలన్నారు.
ఒక్క ఖమ్మం జిల్లా అభివృద్ధ్ది కోసమే ఆలోచించకండి.. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. జిల్లాలో పంట భారీగా పెరిగింది వాటిని నిల్వ చేయడానికి సరిపడా గోదాంలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టకుండా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నదని వారు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. అర్హులకే ఇండ్లు ఇవ్వాలని పలువురు ప్రజా ప్రతినిధులు కోరారు. ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి అంశాలపై సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, యాదాద్రి కలెక్టర్ హనుమంతరావులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జయవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బీర్ల అయిలయ్య, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సూర్యాపేట ఎస్పీ నరసింహ, కార్పొరేషన్ చైర్మన్లు రాయల్ నాగేశ్వరావు, పటేల్ రమేశ్‌రెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, వేణురెడ్డి, గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.