వృత్తిదారులను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఏడాది కూడా ఆగస్టులో చెరువుల్లో ఉచితంగా చేపల సీడ్ వదిలే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. అక్రమాలకు తావు లేకుండా పక్కా ప్లాన్‌తో మత్స్యశాఖ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 161 పెద్ద, 954 చిన్న చెరువులు ఉన్నాయి. ఉచిత చేప పిల్లలు వదిలేందుకు జిల్లాలోని 790 చెరువులను ఎంపిక చేశారు. వీటిల్లో 3.10 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందుకు గానూ రూ.3 కోట్లతో రెండు రకాల చేప పిల్లల సీడ్‌ను కొనుగోలు చేశారు. 35 ఎంఎం నుంచి 40 ఎంఎం పరిమాణం ఉన్న 1.91 కోట్ల చేప పిల్లలను ఒక్కో చేప పిల్లకు 65 పైసలకు కొనుగోలు చేశారు. దాంతో పాటు 80 నుంచి 100 ఎంఎం వరకు ఉన్న 1.15 కోట్ల చేప పిల్లలను ఒక్కొక్కటి రూ. 1.62 చొప్పున కొనుగోలు చేశారు.
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 711 చెరువుల్లో 2,82,25,169 చేప పిల్లలను అధికారులు విడుదల చేశారు. ఇందులో 604 చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం పరిమాణం ఉన్న 1,70,91,369 సీడ్, 107 చెరువుల్లో 80 నుంచి 100 ఎంఎం సైజ్ ఉన్న 1,11,33,800 సీడ్‌ను వేశారు. కొన్ని చెరువుల్లో సరిపడా నీరు లేకపోవడంతో సీడ్ వేయలేదని అధికారులు చెబుతున్నారు. సీడ్ వేసిన చెరువుల్లో చేప పిల్లల పరిమాణం పెరిగింది. అనేక చోట్ల పావుకిలో నుంచి అరకిలో వరకు పెరిగాయి. మార్చి, ఏప్రిల్ వరకు కిలో వరకు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మత్స్యకారులు వలలు వేసి చేపలు పట్టుకొని విక్రయించుకునేందుకు వీలు కలుగనుంది.
ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు ఒట్టిపోయేవి. చెరువుల్లో నీరు లేపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో మత్య్సకారులకు ఉపాధి లభించకపోయేది. దాంతో కొందరు మత్స్యకారులు వలసలు పోగా.. మరి కొందరు ఇతర పనులు చేసుకునేవారు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం తీసుకొచ్చి చెరువుల్లో పూడిక తీత, కట్టల ఆధునీకరణ పనులు చేపట్టింది.
జిల్లా వ్యాప్తంగా 900 చెరువులను పటిష్టం చేశారు. ఫలితంగా కాలంతో సంబంధం లేకుండా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. వీటిల్లో ఉచితంగా చేపల పిల్లలను విడుదల చేస్తుండడంతో ఎంతో మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నది. జిల్లాలో142 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 10 మహిళా మత్య్సపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ద్వారా 8,929 మంది మత్య్సకారులు జీవనోపాధి పొందుతున్నారు. వీరే కాకుండా సభ్యత్వాలు లేని మరికొందరికి పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది.
చెరువుల్లో ఉచితంగా వేసిన చేప పిల్లలు పెద్దవయ్యాక పట్టి విక్రయించుకునేందుకు వీలుగా మత్స్యకారులకు గత ప్రభుత్వం సబ్సిడీ వాహనాలతో పాటు ఇతర ఉపకరణాలను అందించింది. సమీకృత అభివృద్ధి పథకం ద్వారా 75 శాతం సబ్సిడీతో 20 రకాల యూనిట్లు పంపిణీ చేసింది. ద్విచక్రవాహనాలతో పాటు, వలలు, క్రేట్లు, లగేజీ ఆటోలు, మొబైల్ ఫిష్ ఔట్లెట్లు వంటి యూనిట్లను అందించింది. దాంతో పాటు మత్స్యకారులకు బ్యాంకురుణాలు సైతం ఇచ్చింది. మంచినీటి చేప హెచరీస్, చేపల పెంపకానికి పాండ్స్, రీసర్క్యులేటర్ ఆక్వాకల్చర్ సిస్టం, కేజ్ కల్చర్, ఇన్సులేటెడ్ వాహనాల సరఫరా, ట్రైసైకిల్ సరఫరా, చిన్నతరహా చేప దాణా మిల్లుల ఏర్పాటు, చేపల విక్రయ కేంద్రాలు, చేపల పెంపకానికి ఇన్పుట్స్ అందించింది.
చేపల వేటను నమ్ముకొని వృత్తిని కొనసాగిస్తున్న వారికి ప్రమాద బీమా కూడా గత ప్రభుత్వం అందించిది. వృత్తిలో భాగంగా నీటమునిగినా, ఇతర ప్రమాదాల్లో చనిపోయినా, వైకల్యం పొందినా బీమా అందుతున్నది. మత్స్యకార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, వైకల్యం పొందితే 2.5 లక్షల పరిహారం ఇస్తున్నారు. ఇందుకోసం మత్స్యకారులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. సహకార సంఘాల్లో సభ్యులై ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది.
ఈ ఏడాది ఆగస్టులో ఉచిత చేపల పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాం. జిల్లాలో మొత్తంగా 711 చెరువుల్లో 2.82కోట్ల సీడ్ వదిలాం. ఇప్పటికే చెరువుల్లో వదిలిన చేపలు అరకిలో వరకు సైజ్ పెరిగాయి. మార్చి, ఏప్రిల్ వరకు కిలో వరకు పెరిగి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో సుమారు తొమ్మిది వేల మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నది. వారికి సబ్సిడీపై వాహనాలు, ఇన్పుట్స్ ఇవ్వడంతోపాటు బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నాం.
– రాజారాం, జిల్లా మత్స్యశాఖ అధికారి