నల్లగొండ రూరల్, నవంబర్ 1 : అన్నదాతలు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి ముద్ద అవుతున్నది. నల్లగొండ జిల్లాకేంద్రం శివారులోని కొనుగోలు కేంద్రంలో రవాణాలో జరిగిన జాప్యం కారణంగా ఎక్కడి ధాన్యం రాశులు అక్కడే ఉన్నాయి. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మూడు గంటలకుపైగా కురిసిన వడ్లు వరదలో కొట్టుకుపోయాయి. ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో 84 కుప్పలకు పైగా ధాన్యం 17 శాతమే తేమ ఉన్నప్పటికీ సకాలంలో లారీలు రాకపోవడంతో లోడ్ ఎత్తలేదు.
మరోవైపు రెడ్డికాలనీ గ్రామంలో సెంటర్ ప్రారంభించి నాటి నుంచి కేవలం రెండు లారీలు మాత్రమే కొనుగోలు చేశారు. అక్కడా ధాన్యం భారీగా తడిసి కొంత వరకు వరదకు కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు గురువారం రైతులు నానా అవస్థ పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వడ్లు సకాలంలో కొనేవారని చెప్పుకొచ్చారు.