నీలగిరి, అక్టోబర్ 15 : గర్భిణులు, బాలింతలతో పాటుగా ఐదేండ్ల లోపు చిన్నారులకు పోషకాహారం అందించడం వల్ల వారిలో రక్తహీనతను దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దవచ్చని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. పోషణ మాహ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో పానగల్, చర్లపల్లి, గొల్లగూడ సెక్టార్లలోని గర్భిణీలు, బాలింతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు, కౌమార బాలికలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులను లక్ష్యంగా చేసుకుని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు పోషకాహారం తీసుకుంటే అనీమియా బారిన పడకుండా ఉంటారన్నారు. గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు, మహిళలు పూర్తి స్థాయిలో పోషకాలు అంటే ఆహరం తీసుకోవాలని, తద్వారా ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టి రేపటి రాబోయే రోజుల్లో బావిభారత పౌరులు అవుతారని పేర్కొన్నారు.
గర్భిణీలు నాణ్యమైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తహీనత, శక్తి, మాంసకృతుల లోపం, అయోడిన్, విటమిన్ ఏ, బీ లోపాలకు గురికారన్నారు. పౌష్టికాహారం లోపం వల్ల బరువు తక్కువగా ఉండటం, బలహీనంగా ఉండటం వంటి సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడం, గుండె కదలికలు, బుద్ధి మాంద్యం, మృత జననాలు, పిల్లల మరణాలు, పురిటి మరణాలు సంభవిస్తాయని తెలిపారు. ఆరోగ్యానికి ఉపయోగపడే ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లు, ధాన్యాలు, చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు లక్ష్మమ్మ, పార్వతి, సరస్వతి, అంగన్వాడీ టీచర్లు శ్రీలక్ష్మీ, అనిత, సరిత, భాగ్యలక్ష్మీ, రజిత, సునంద, సావిత్రమ్మ, విజయ, మంగ, ప్రకృతాంబ, రాజేశ్వరి, పద్మ, భారతి, ఆశ వర్కర్లు, గర్భినీలు, బాలింతలు పాల్గొన్నారు.
పోషణ మహ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్లగొండలోని చైతన్యపురి కాలనీ సెక్టార్ పరిధిలో గల రైతు బజార్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ వినోద కుమారి గర్భిణీలు, బాలింతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రజియా, షాహనాజ్, అనంతలక్ష్మి, జరీనా, జ్యోతి, ఆశవర్కర్ వీరభద్రమ్మ, శోభ పాల్గొన్నారు.
Nilagiri : పోషకాహారంతో రక్తహీనత దూరం : సీడీపీఓ తూముల నిర్మల