పదేండ్ల కేసీఆర్ పాలనలో సిరులు పండించిన ఆలేరు నియోజకవర్గం.. ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నది. ఎక్కడ చూసినా ఎండిన చెరువులు, అడుగంటిన బావులు, బోర్లు, ఓ ఓల్టేజీ కాలుతున్న మోటార్లు.. నీళ్లు ఎండుతున్న పంటలు.. పశువుల మేతగా మారిన వరిపైర్లే కనిపిస్తున్నాయి. రాజాపేట, ఆలేరు, ఆత్మకూరు(ఎం), మోటకొండూర్, గుండాల, యాదగిరిగుట్ట మండలాల్లో ఇప్పటికే వేల ఎకరాల్లో వరి ఎండిపోయింది.
– యాదగిరిగుట్ట, మార్చి21
గత బీఆర్ఎస్ సర్కారులో కోట్ల రూపాయలు వెచ్చించి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరద్ధరించి నీళ్లు నింపడంతో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండి పంటలు బాగా పండాయి. నాడు నడి వేసవిలోనూ కళకళలాడిన చెరువులు నేడు వెలవెలబోతున్నాయి. సాగునీరు తెచ్చే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు నింపే విషయంపై దృష్టి పెట్టకపోవడం రైతులకు శాపంగా మారింది. నియోజకవర్గవ్యాప్తంగా 637 చెరువులు, కుంటలు ఉండగా, 439 చెరువులు, కుంటలు డెడ్ స్టోరేజీకి చేరాయి. మిగతా 198 చెరువుల్లో 20 నుంచి 50 శాతంలోపు మాత్రమే నీళ్లున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడం అవి కూడా వేగంగా తగ్గిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన 15 ప్యాకేజీలోని ఓటీ 1, ఓటీ2 నుంచి కొన్ని చెరువులనే మాత్రమే నింపిన స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్ని చెరువులకు నీళ్లు తెచ్చామంటూ సోషల్ మీడియా ప్రచారానికి పరిమితమవడంపై రైతులు భగ్గుమంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాణ్యమైన ఉచిత విద్యుత్ నిరంతరాయంగా సరఫరా అవడంతో రైతులు బావులు, బోర్ల ఆధారంగా రంది లేకుండా వ్యవసాయం చేసుకున్నారు. కానీ, ప్రస్తుతం లోఓల్టేజీ, అప్రకటిత కోతలు పంటలను నాశనం చేస్తున్నాయి. 5 హెచ్‌పీ మోటారు నడువాలంటే కనీసం 240 ఓల్టేజీ విద్యుత్ సరఫరా అవసరం కాగా, 160 నుంచి 180 ఓల్టేజీలోపే విద్యుత్ సరఫరా అవుతున్నదని రైతులు వాపోతున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీ ఫేస్ కరెంటు ఇస్తుండగా, ఐదారు సార్లు వచ్చిపోతున్నదని, కరెంట్ పోయిన ప్రతిసారీ తిరిగి వచ్చేందుకు కనీసం అరగంట సమయం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లో ఓల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయని చెప్తున్నారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో పారుపల్లి శ్రీనివాస్‌రెడ్డి అనే రైతు పొలంలోని స్టార్టర్ బాక్స్‌లో విద్యుత్ ఓల్టేజీ పరీక్షించగా, కేవలం 200లోపు ఓల్టేజీ చూపింది. ఈ సీజన్లో మూడుసార్లు మోటర్ కాలిపోయినట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ పాలనలో కరెంటు సమస్య లేదని, మోటార్లు కాలిపోదని గుర్తుచేసుకున్నారు. విద్యుత్ సమస్య కారణంగా కొంత పొలం కూడా తడవడం లేదని రైతులు చెప్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది.
మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన బాల్ద శ్రీనివాస్ అనే రైతు మూడెకరాల్లో వరి సాగు చేశారు. భూగర్భజలాలు ఇంకిపోవడంతో ఉన్న రెండు బోర్లూ ఎండిపోయాయి. పొట్ట దశలో పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీళ్లు పడుతున్నారు. మూడు రోజులకు ఒకసారి రూ.2,500 అవుతున్నాయని శ్రీనివాస్ తెలిపారు. పెట్టుబడి పెరుగుతున్నదని, పంట చేతికి వస్తేనే బయటపడేదని వాపోయారు.
-మోటకొండూర్
రాజాపేట : రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన రైతు ఎండీ మోయినొద్దీన్ తనకున్న ఎకరం పొలంలో వరి సాగు చేశాడు. పంట పొట్ట దశకు వచ్చేసరికి బోరు ఎండిపోతుండడంతో నీళ్ల కోసం అదే పాయింట్లో లక్ష రూపాయలు ఖర్చు చేసి 700ఫీట్లు బోరు తవ్వించాడు. పంట చేతికి వచ్చే వరకైనా నీళ్లు అందింతే చాలని అల్లాను వేడుకుంటున్నాడు.
నాకున్న ఆరెకరాల్లో ఎప్పటిలాగే వరి నాటు పెట్టాను. జనగామ జిల్లా బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు వస్తాయని అనుకున్నా. కానీ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడంతో మొత్తం ఆరెకరాలు ఎండిపోయింది. అటు పెట్టుబడి పోయింది. కష్టం వృధా అయ్యింది. కనీసం పశువుల మేతకు అయినా పనికి వస్తుందని ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోస్తున్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో మందు చల్లే స్ప్రేయర్‌తో నీళ్లు కొడుతున్నాను. పంటలను ఎండిన రైతులను ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
-మామిడాల అంజయ్య, రైతు, కొలనుపాక(ఆలేరు మండలం)
ఎక్కడికక్కడ పంటలు ఎండి రైతులు అరిగోస తీస్తున్నా పరిశీలించిన ప్రజాప్రతినిధి గానీ, అధికారి గానీ లేరు. రైతులు వెళ్లి తమ పొలం ఎండిందని మొరపెట్టుకుంటే సర్వే చేసి నోట్ చేసుకుంటున్నారు తప్ప పంట నష్టం అంచనా వేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని మండల వ్యవసాయాధికారులు చెప్తున్నారు. ఈ యాసంగి సీజన్లో 1,04,850 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, ఇప్పటికే 16,925 ఎకరాల్లో పూర్తిగా ఎండిపోయి పశువులకు మేతగా మారింది. మిగిలిన పంట ప్రశ్నార్థకంగా మారింది.
ఆత్మకూరు(ఎం) మండలం సారగండ్లగూడెం గ్రామానికి రైతు ఈదునూరి రాములు మూడెకరాల్లో వరి పడితే ఇప్పటికే రెండు ఎకరాలు ఎండిపోయింది. మరో ఐదెకరాల ఆయిల్‌పామ్ తోట ఉండగా, నీళ్లు లేక అదికూడా వాడుముఖం పడుతున్నది. ప్రస్తుతం ఆయిల్‌పామ్ మొక్కలను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీళ్లు కొనుగోలు చేసి పడుతున్నారు. ఒక్క ట్యాంకర్‌కు 2వేల రూపాయలు అవుతున్నాయని రాములు వాపోయారు. తనకు నాలుగు బోర్లు ఉన్నా ఒక్కదాంట్లోనూ నీళ్లు రావడం లేదని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎండకాలంలోనూ నీళ్లకు కరువు రాలేదని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు గోదావరి జలాలు అందకపోవడంతో బోర్లు, బావులు వట్టిపోయి పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
-ఆత్మకూరు(ఎం)