సూర్యాపేట, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : గోదావరి జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచబోతున్నారని, అందుకు నిదర్శనం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్ చేసిన వ్యాఖ్యలేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ నిర్మించనున్న బనకచర్లను అడ్డుకునే ఆలోచనే నిజంగా రేవంత్‌కు ఉంటే కాళేశ్వరం నుంచి 240 టీఎంసీల నీటిని వాడుకున్న విషయాన్ని రేవంత్ ఉటంకించి ఉండేవారన్నారు. ఇది చెప్పకపోతే బనకచర్లకు అనుమతి ఇచ్చినట్లేనని, రేవంత్ నేరుగా చంద్రబాబుకు దాసోహమై తెలంగాణను నట్టేట ముంచి, రైతులకు ద్రోహం చేస్తున్నాడన్నారు. ‘పంద్రాగస్టునాడు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ప్రసంగాలను విన్నం..ఇద్దరూ స్పష్టమైన అవగాహనతో ఉన్నారని అర్థమైంది’ అని అన్నారు. సముద్రంలోకి పోయే నీటికి అడ్డు కట్ట వేసి, బనకచర్ల నిర్మించి తీరుతామని చంద్రబాబు చేసిన ప్రసంగానికి కొనసాగింపుగా ఇక్కడ కాళేశ్వరమే లేదంటూ కేసీఆర్‌పై రేవంత్ ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇది కేవలం గురుదక్షిణో మరేదో కానీ బనకచర్ల కోసమే చంద్రబాబుకు మద్దతుగా రేవంత్ ప్రసంగించారని, రెండు వేర్వేరు ప్రసంగాలు కాదని, పోటాపోటీ ప్రసంగాలు అసలే కాదన్నారు.
కానీ డ్రామా చేసే కొన్ని మీడియాల్లో, డబ్బా ఛానెళ్లల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడి మాట్లాడిండ్రని ప్రసారాలు చేశాయన్నారు. వాస్తవానికి అసలు విషయం అర్థం కాకనో లేక స్పాన్సర్ ప్రోగ్రామో కానీ.. నిన్నటిది మాత్రం బనకచర్ల కుట్రకు అనుకూలంగానే రేవంత్ తాళం వేసి.. వంత పాట పాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇక్కడ కాళేశ్వరం ఉన్నది.. దాని ద్వారా 240 టీఎంసీల నీటిని వాడుకుంటున్నం.. అందుకే గోదావరిలో చుక్కనీరు లేవు, ఎట్టి పరిస్థితుల్లో బనకచర్ల కట్టవద్దంటూ.. రాష్ట్ర ప్రభుత్వ వాదన ఉండాలే తప్ప.. అసలు కాళేశ్వరమే లేదని చెప్పడం.. చంద్రబాబుకు వత్తాసు పలకడమేనని దీనికి ఇంకేదో సాక్ష్యాలు అవసరం లేదన్నారు. కాళేశ్వరంపై ఉన్న నంది మేడారం, కన్నెపల్లి గాయత్రి పంప్‌హౌజ్‌లను ప్రారంభించారంటేనే కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బాగున్నట్లేనని.. ఇక మీరు ప్రారంభించాల్సిందల్లా కన్నెపల్లి పంప్‌హౌజ్, సుందిళ్ల వద్ద గోలివాడ పంప్‌హౌజ్‌లను మాత్రమేనని, ఈ రెండింటినీ ఆన్ చేస్తే ప్రాజెక్టు మొత్తం పూర్తి స్థాయిలో పని చేస్తుందన్నారు. కాగా తెలంగాణ మొత్తం ఏకమై చంద్రబాబు, రేవంత్ కుట్రలను అడ్డుకుంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల కట్టకుండా వ్యతిరేకించి తీరుతామన్నారు. కాళేశ్వరానికి ఉన్న 240 టీఎంసీల కాకుండా గోదావరిలో ఒక్క చుక్క నీరు లేదు.. మిగులు జలాల సమస్య లేదంటూ ఇంకొక ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తరువాతనే ఎన్ని నీళ్లు ఉన్నాయో తేలుతుందని, అప్పుడే మిగిలిన ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని అప్పటి వరకు బనకచర్లను అడ్డుకొని తీరుతామన్నారు.
జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు ఆ శాఖపై ఏమి అవగాహన ఉందో ఏమో తెలియదు కానీ నిన్న దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లిస్తానని చెప్పడంపై జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ పేరు ఏదైనా పెట్టుకోండి.. రైతులకు మాత్రం నీళ్లివ్వాలన్నారు. అంతే కాకుండా ఉత్తమ్ వ్యాఖ్యలతో తమకు వచ్చేవి కాంగ్రెసోళ్లు చెబుతున్నట్లు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కాదని, వారు చెబుతున్నది పచ్చి అబద్ధమని ప్రజలకు అర్థమైందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లా రైతాంగం, వరంగల్ జిల్లాలోని మిగతా రైతాంగం పంటలు పండించింది కాళేశ్వరం నీళ్లేనని ఉత్తమ్ స్పష్టంగా చెప్పాడన్నారు. మంత్రి మళ్లీ ఈ రోజు కొత్తగా దేవాదుల అంటున్నడని.. రైతాంగానికి ఒక్కటే కావాలి అది నీళ్లే నన్నారు. ఈ సంవత్సరం ఒక్క ఎకరం ఎండకుండా నీళ్లివాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై చాలా రోజులవుతున్నా గోదావరి ఆయకట్టు కింద నాట్లు వేయలేదని, అదృష్టవశాత్తు సూర్యాపేట జిల్లాలో గత వారం పది రోజులుగా వర్షాలు కురిసి కాళేశ్వరం ఆయకట్టు ప్రాంతంలో వరి నాట్లు, ఇతర పంటలు సాగు చేస్తున్నారన్నారు. సూర్యాపేటకు నీళ్లు తీసుకురావాల్సిన బాధ్యత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, ముఖ్యమంత్రిపై ఉందన్నారు. పంట చేతికి వచ్చే వరకు తగినన్ని నీళ్లు వస్తాయనే ఆశతో రైతులు పంటలపై పెట్టుబడి పెడుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.