కొండమల్లేపల్లి, ఫిబ్రవరి 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులకు విద్యబోధనతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో వసతులు కరువయ్యాయి. దేవరకొండ, కొండమల్లేపల్లి సెక్టార్ల పరిధిలో దాదాపు సగానికి పైగా అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె ఇండ్లలోనే ఏర్పాటు చేశారు. మరి కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇరుకు గదులు కేటాయించినా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం గమనార్హం. పౌష్టికాహారం అందించే ఈ కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్బిణులు, బాలింతలకు మంచినీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి శిథిలావస్థకు చేరాయి. ఎక్కువ శాతం అంగన్వాడీలు అద్దె ప్రాతిపదికన రేకుల ఇండ్లలోనే కొనసాగుతున్నాయి. విద్యుత్తు సదుపాయం లేక, ఫ్యాన్లు పని చేయకపోవడంతో వేసవిలో ఇక్కడ ఉండే చిన్నారులకు చెట్ల కిందే పాఠాలు బోధిస్తూ..ఆటలు అడిస్తూ భోజనాలు పెడుతున్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని అయా గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నివించినా పట్టించుకోవడంలేదు.
కొండమల్లేపల్లి సెక్టార్లోని కొండమల్లేపల్లి పెద్దఅడిశర్లపల్లి, గుర్రంపోడు మండలాల పరిధిలో మొత్తం 179 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 55 అంగన్వాడీలకు సొంత భవనాలు ఉండగా 59 అంగన్వాడీ గ్రామ పంచాయతీ, సామాజిక కమ్యూనిటీ కార్యాలయాల్లో (అద్దె లేకుండా), 65 అంగన్ వాడీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి 65 అంగన్వాడీలకు నెలకు రూ.70 వేల అద్దె చెల్లిస్తున్నారు. కొండమల్లేపల్లి సెక్టార్ పరిధిలో 4190 మంది చిన్నారులు ఉండగా, 575 మంది గర్భిణులు, 505 మంది బాలింతలు ఉన్నారు. దేవరకొండ సెక్టార్లోని దేవరకొండ, నేరేడుగొమ్ము, చందంపేట, డిండి (గుండ్లపల్లి) మండలాల పరిధిలో 284 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి వీటిలో 91 అంగన్ వాడీలకు సొంత భవనాలు, 113 అంగన్ వాడీలు ప్రభుత్వ కార్యాలయాల్లో(అద్దె లేకుండా), 81 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 81 అంగన్ వాడీలఅకు నెలకు రూ. 76 వేల అద్దె చెల్లిస్తున్నారు. దేవరకొండ సెక్టార్ పరిధిలో 6169 మంది చిన్నారులకు విద్యబోధిస్తున్నారు. దీంతో దేవరకొండ, కొండమల్లేపల్లి సెక్టార్ల పరిధిలో 146 అంగన్వాడీలకు నెలకు రూ. 1.46 లక్షల అద్దె చెల్లిస్తున్నా సరైన వసతులు లేవు. దీంతో చి న్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్పందించి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కొండమల్లేపల్లిలో ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆరు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో సరైన వసతుల లేక గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేసే విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మించి సమస్యలు పరిష్కరించాలి.
-సిరందాసు మౌనిక, బాలింతరాలు, కొండమల్లేపల్లి
అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం లేదు. అద్దె భవనాల్లో వసతులు తీవ్ర లేక ఇబ్బందులు పడుతున్నాం. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదు.
– కొట్ల శోభ, అంగన్వాడీ టీచర్
అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను నివేదిక ద్వారా ప్రభుత్వానికి అందజేస్తాం. నిధులు మంజూరైన వెంటనే చర్యలు తీసుకుంటాం. సొంత భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నివేదిక తయారు చేసి ఉన్నతధికారులకు అందజేశాం. మౌలిక వసతులు లేని అంగన్వాడీ కేంద్రాలకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
– ఖతీజా బేగం, సీడీపీవో, కొండమల్లేపల్లి