దేశంలో దారిద్య్రం తాండవిస్తున్నదని, డబుల్ ఇంజిన్ సర్కార్‌లో అభివృద్ధి డొల్ల అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ తీశారు. కోలాటాలు, డప్పు దరువుల మధ్య మహిళలు బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో వ్యవసాయానికి ఆరు గంటలే కరంట్ ఇస్తున్నారని, అదికూడా ఉచితం కాదని తెలిపారు.
దేశంలో, కొన్ని రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా ఎక్కడ కూడా అభివృద్ధి జరుగలేదని, పేదల బతుకులు మారలేదని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ఎందుకు లేవో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని, మోదీ నుంచి దేశాన్ని రక్షించేందుకే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిందని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అలజడి రేపేందుకు బీజేపీ కుట్రలకు తెరలేపిందని, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.
నాగారం, ఏప్రిల్ 5 : డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి డొల్లేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తేల్చి చెప్పారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతోపాటు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ బీజేపీ పాలనే కొనసాగుతున్నా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందన్నారు. 2014కు పూర్వం తెలంగాణ ప్రాంతంలో మంచినీటి కోసం కుళాయిల వద్ద బారులు తీరిన వైనం ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో కనిపిస్తున్నదని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ కమలనాథులు ఊదరగొడుతున్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. పైగా అక్కడ కరెంట్ సరఫరా కేవలం ఆరు గంటలేనని, అది కూడా మోటర్లకు మీటర్లు పెట్టి మెడ మీద కత్తి ఉంచి బిల్లులు వసూలు చేయడమే డబుల్ ఇంజిన్ సర్కార్ సంకల్పమా? అని సూటిగా ప్రశ్నించారు.
అదే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రగల్బాలు పలుకుతున్న గుజరాత్లో ఆసరా పింఛన్ అక్షరాల 600 రూపాయలు మాత్రమేనని పేర్కొన్నారు. సుదీర్ఘంగా మోదీ పాలనలో ఉన్న గుజరాత్లో దారిద్య్రం ఆరున్నర శాతం నుంచి ఎనిమిదిన్నర శాతానికి పెరిగిందని, అదే డబుల్ ఇంజిన్ సర్కార్ మహిమ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్‌లో గుజరాత్‌తో సహా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎందుకు పెట్టలేదో తేల్చి చెప్పాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. బీజేపీ ఎలుబడిలో ఉన్న రాష్ర్టాల్లో ఇవన్నీ పెట్టకపోగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అలజడి రేపేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. అందులో భాగమే కాషాయదళం కనిపెట్టిన వాట్సాప్ యూనివర్సిటీలో పదో తరగతి ప్రశ్నపత్రం వైరల్ అంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అటువంటి పార్టీతో అప్రమత్తంగా ఉండి మోదీ బారీ నుంచి దేశాన్ని రక్షించేందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిందన్నారు. అంతకు ముందు మహిళలు, కోలాట బృందాలు బతుకమ్మలు, బోనాలతో డప్పుచప్పుళ్ల మధ్య పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం నాగారం ఎక్స్‌రోడ్‌లో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి మంత్రి నివాళి అర్పించారు.
ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే : ఎమ్మెల్యే కిశోర్‌కుమార్
ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్న గొప్ప సీఎం కేసీఆర్ అన్నారు. నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద దళితబంధుకు ఎంపిక చేసి 2,510 కుటుంబాలకు 250 కోట్లను అందజేసినట్లు తెలిపారు. బీజేపీ పాలనలో దేశంలో దారిద్య్రం గతంలో కంటే రెండు శాతం పెరిగిందని, దేశంలోని 27 రాష్ర్టాల్లోని ప్రజలు ఇప్పటికీ ఒక పూట పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలువుతున్న సంక్షేమ పథకాలు గుజరాత్లో లేవని, ప్రధాని మోదీ ప్రపంచంలోనే పెద్ద మోసకారి అని ఎద్దేవా చేశారు. అబద్ధాలతో దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గులాబీ జెండాతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, గొర్ల పంపిణీ పథకాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. నిత్యం పేదల కడుపు కొడుతున్న బీజేపీ కావాలా? అనేక సంక్షేమ పథకాలతో పేదల కడుపు నింపుతున్న బీఆర్ఎస్ కావాలా అనేది ప్రజలు ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లి మూడోసారి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సైనికుల్లా పని చేయాలని సూచించారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : జడ్పీ చైర్పర్సన్ దీపిక
జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు మాట్లాడుతూ నాడు కరెంట్ కోసం రైతులు పడిగాపులు కాచేవారని, స్వరాష్ట్రంలో రైతుల కోసం ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమాతోపాటు పండిన ప్రతిగింజనూ కొనుగోలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పాలన కొనసాగుతుందన్నారు. 30 ఏండ్లలో పూర్తికాని ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేండ్లలో పూర్తి చేసి తుంగతుర్తి ప్రజలకు నీరు అందించిన గొప్ప నాయకుడు అన్నారు. గతంలో తాగునీరు దొరక్క మహిళలు రోడ్లపైకి బిందెలతో వచ్చిన పరిస్థితి ఉండేదని, స్వరాష్ట్రంలో మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందిస్తూ మహిళల్లో ఆత్మగౌరవం పెంచారన్నారు.
ఇంటింటికీ పథకాలు అందేలా చూడాలి : మెట్టు శ్రీనివాస్
బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సహచరుడు, నాగారం ముద్దుబిడ్డ గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఉస్మానియా ఉద్యమ కెరటం గాదరి కిశోర్‌కుమార్ తుంగతుర్తి ప్రాంతాన్ని చేస్తున్నారన్నారు. ఎస్సారెస్పీ కాల్వ ద్వారా బీడువారిన నేలను కేసీఆర్ సారథ్యంలో పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలం చేశారని కొనియాడారు. 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ బీఆర్ఎస్ అని, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఉమ్మడి పాలనలో రక్తం ఎరులై పారిన తుంగతుర్తి నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమైందని పేర్కొన్నారు. గతంలో నీళ్లు లేక ఆకలితో, చావుకేకలతో అల్లాడిన ప్రాంతం తెలంగాణలో నేడు గుంట భూమున్న రైతుకూ గుండె ధైర్యం నింపిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో నాగారం గ్రామంలో పల్లె నిద్ర కోసం రెండ్రోజులు ఇక్కడే ఉన్నట్లు గుర్తు చేశారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేసి ముచ్చటగా మూడోసారి గాదరి కిశోర్‌కుమార్‌ను 50 వేల మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మినేని స్రవంతి, వైస్ చైర్మన్ యారాల రాంరెడ్డి, ఎంపీపీ కూరం మణీవెంకన్న, జడ్పీటీసీ కడెం ఇందిరా పరమేశ్వర్, వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండగాని అంబయ్యగౌడ్, బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్‌బాబు, జిల్లా నాయకుడు యర్ర యాదగిరి, కార్యదర్శి కేశగాని అంజయ్య, మండల పార్టీ ఉపాధ్యక్షుడు దోమల బాలమల్లు, రైతుబంధు సమితి సభ్యుడు పొదిల రమేశ్, అధికార ప్రతినిధి చిల్లర చంద్రమౌళి, యూత్ అధ్యక్షుడు ఈదుల కిరణ్‌కుమార్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు యారాల నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.